హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) అధికారులు సంగారెడ్డి జిల్లా పరిధిలోని 17 ప్లాట్లను విక్రయించడానికి రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు గురువారం సంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులతో కలిసి గీతం యూనివర్సిటీలో ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిడ్డర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 150 మంది ఔత్సాహికులు, రియాల్టీ సంస్థల ప్రతినిధులు, స్థానికులు హాజరయ్యారు. ఈ ప్రీబిడ్ సమావేశానికి హెచ్ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో నగేష్, హెచ్ఎండిఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్లతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన అమీన్ పూర్, ఇస్నాపూర్, రామచంద్రాపురం పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ పార్సిళ్లు ఉండటంతో ఔత్సాహికులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటం విశేషం.