House prices increased slightly in hyderabad
హైదరాబాద్ లో ఇళ్ల ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్లో ప్రాపర్టీ ధరల్లో 5 శాతం మర పెరుగుదల నమోదైంది. 2024 డిసెంబర్ త్రైమాసికంలో చదరపు అడుగు సగటు ధర రూ.7,053 ఉండగా.. 2025 మార్చి చివరినాటికి అది రూ.7,412కి చేరింది. ముంబై, ఢిల్లీ, పుణె, చెన్నై నగరాల్లో ధరలు స్థిరంగా ఉండగా.. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతాలో ధరలు 4-5 శాతం మధ్య పెరిగినట్టు ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడించింది. ఇళ్ల ధరలు గత కొన్నేళ్ల నుంచి ఏటా పెరుగుతూ వచ్చాయని.. ఆ పెరుగుదల వేగం ఇటీవలి త్రైమాసికాల్లో కాస్త తగ్గినట్టు పేర్కొంది.
దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో మార్చి త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 19 శాతం తక్కువగా 98,095 యూనిట్లుగా ఉన్నట్టు ప్రాప్ టైగర్ గత నెలలో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. గత కొన్ని త్రైమాసికాలుగా ఇళ్ల ధరల పెరుగుదల మోస్తరుగా ఉండడం మార్కెట్ స్థిరపడినట్టు సంకేతమిస్తోందని హౌసింగ్ డాట్ కామ్, ప్రాప్ టైగర్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు.
నగరాలవారీగా ధరలు చూస్తే.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల ధర చదరపు అడుగుకు రూ.12,600గా ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోనూ ఎలాంటి మార్పు లేకుండా రూ.8,106, చెన్నైలో 7,173, పుణెలో రూ.7,109 చొప్పున చదరపు అడుగు ధర మార్చి త్రైమాసికంలో ఉంది. అహ్మదాబాద్‌లో చదరపు అడుగు ధర డిసెంబర్ చివరికి రూ.4,402గా ఉంటే, మార్చి చివరికి రూ.4,568కి చేరింది. బెంగళూరులో ఇళ్ల ధర చదరపు అడుగుకు రూ.7,536 నుంచి రూ.7,881కి చేరింది. కోల్‌కతాలో రూ.5,633 నుంచి రూ.5,839కి పెరిగింది.
This website uses cookies.