Hydra is there to protect Hyderabad: CM Revanth Reddy
కాలుష్య నియంత్రణ లేక మెట్రో నగరాలు నివాసయోగ్యంలేని నగరాలుగా మారుతున్నాయని, హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి ఎదురవకూడదనే లక్ష్యంతో ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్క చేయకుండా హైడ్రాను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలు కూల్చడంలో వెనక్కి తగ్గేది లేదని, ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో హైదరాబాద్ పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేసిందన్నారు. చెరువులు ఆక్రమిస్తే ఎంతటి వారినైనా హైడ్రా ఉపేక్షించదన్నారు. హైడ్రా పేరు చెప్పగానే కబ్జాదారులకు వెన్నులో వణుకు పుట్టాలని, చెరువులు, నాలాలు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు అనే తేడా లేకుండా.. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసేద్దామనే ఆలోచన చేసిన వారికి హైడ్రా ఉందనే భయం కనిపించాలన్నారు. హైదరాబాద్ బుద్ధభవన్ వద్ద ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఇటీవల సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా 21 డీఆర్ఎఫ్ ట్రక్కులు, 55 స్కార్పియోలు, 4 ఇన్నోవా క్రిస్టాలు, 5 మినీ బస్సులు, 37 ద్విచక్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక మంచి ఆలోచనతో చారిత్రక నగరం హైదరాబాద్ పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేశామన్నారు. 1908లో వచ్చిన వరదలు నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయని, ఆనాడు వరదల నివారణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను నిజాం నిర్మించారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఒకప్పుడున్న చెరువుల పరిధి ఇప్పుడు లేదని, చాలా చోట్ల ఆక్రమణలు జరిగాయని, ఇప్పుడు నగరాన్ని పునరుద్ధరించుకోవాలని దృక్పథంతో హైడ్రాను ముందుకు తీసుకొచ్చామన్నారు. బెంగుళూరులో చెరువులను పరిరక్షించక పోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముంబై, చెన్నై నగరాలు వరదలతో సతమవుతున్న పరిస్థితులు చూస్తున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి అలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశ్యంతో హైడ్రాను రంగంలోకి దింపామన్నారు.
ప్రకృతిని కాపాడుకోలేకపోతే హైదరాబాద్‌లోను విపత్కర పరిస్థితులను ఎదుర్కొనక తప్పదని, ప్రస్తుతం హైదరాబాద్‌లో చిన్న వర్షం వస్తే కాలనీలకు కాలనీలే మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుందన్నారు. కాలుష్యాన్ని నియంత్రికపోవడంతో ఢిల్లీలో పార్లమెంట్ నుంచి పాఠశాల వరకు సెలవులు ప్రకటిస్తున్నారని, మెట్రో నగరాలు నివసించడానికి యోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయని, ప్రకృతిని కాపాడుకోకపోతే హైదరాబాద్ లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని, అందుకే ఎవరేం అనుకున్నా హైడ్రాను తీసుకొచ్చామని సీఎం తెలిపారు.
కొందరికి దుఃఖం వస్తుంది
నగరంలో 940 చెరువులు ఉండగా..వాటిలో 491 చెరువుల కబ్జాకు గురయ్యాయని, పెద్ద పెద్ద కాలువలు మూసుకుపోయాయని, ఇప్పుడు ట్రాఫిక్ జామ్‌లకు ఈ ఆక్రమణదారులే కారణమని సీఎం వెల్లడించారు. వాటర్ వ్యూ, లేక్ వ్యూ పేరుతో నేరుగా చెరువుల్లో బిల్డింగ్‌లు కడుతున్నారని, వాళ్ల డ్రైనేజీ తాగునీటి చెరువులో కలుపుతున్నారని, దీన్ని ఇలానే వదిలేస్తే భవిష్యత్తులో ఇంకా కబ్జాలు పెరిగిపోతాయన్నారు. వీటిని నియంత్రించి ప్రజల్ని కాపాడేందుకు హైడ్రాను ఏర్పాటు చేశామని, చెరువుల్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు హైడ్రా అధికారులు ప్రయత్నిస్తున్నారని సీఎం చెప్పారు. హైడ్రా ద్వారా చెరువులను కాపాడి వాటిని పునరుద్ధరిస్తోందని, నాలాలను, మూసీని ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే కోపం వస్తుందన్నారు. పునరుద్ధరించుకుంటామంటే కొందరికి బాధైతుందని, ప్రకృతిని కాపాడుతామంటే కొందరికి దుఃఖం వస్తుందని, ఆక్రమణలు తొలగిస్తుంటే రియల్ ఎస్టేట్ పడిపోతుందని మాట్లాడుతున్నారంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు కొందరి బాధ ఎంది? వాళ్ళు కడుపు నిండా విషం నింపుకుని ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. ప్రజలకు మేలు జరగొద్దని చూస్తున్నారు. గుజరాత్ లో సబర్మతి, యూపీలో గంగా నది, ఢిల్లీలో యమునా నదిని వాళ్లు ప్రక్షాళన చేసుకుంటున్నారు. కానీ మేం మూసీని పునరుద్ధరణ చేస్తామంటే అడ్డుకుంటున్నారు. బీజేపీ నాయకులు చేస్తే కరెక్టు.. తెలంగాణలో కాంగ్రెస్ చేస్తే తప్పా? నాపై కక్ష ఉంటే నాపై చూపండి.. ప్రజలకు మేలు జరిగే పనులను అడ్డుకోవద్దు.
వారసత్వ సంపదను కాపాడుకుని నగరాన్ని పునరుద్ధరించుకుందాం. హైడ్రా అధికారులకు నా సూచన. పేదల పట్ల మానవీయ కోణంతో, సానుభూతితో వ్యవహరించండి. పేదలకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.. పెద్దల పట్ల కఠినంగా వ్యవహరించండి“ అని సీఎం కోరారు. వారసత్వ సంపదను కాపాడుతూ.. హైదరాబాద్ నగరాన్ని పునరుద్ధరించుకుందామని ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. పేదల పట్ల మానవీయ కోణంలో సానుభూతితో వ్యవహరించాలని, అక్రమణలకు పాల్పడిన పెద్దల పట్ల కఠినంగా ఉండాలని హైడ్రా అధికారులకు సీఎం రేవంత్ సూచించారు.
ఎందుకు అడ్డుకుంటున్నారు
రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూడా విపక్షాలు అడ్డు పడుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. 400 ఎకరాల్లో ఐటీ పార్క్ అభివృద్ధి చేద్దామని నిర్ణయించుకుంటే ముందుకు పోనీయడం లేదని, అభివృద్ధి చేయకూడదు, ప్రజలకు మేలు జరగకూడదు అనే ఆలోచనతో కొందరు ఉన్నారన్నారు. దావోస్ వెళ్లి 2.20 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చామని, వారికి ఇక్కడ స్థలాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని, అందుకోసమని 400 ఎకరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే అడ్డుకుంటున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
మీరు ఫాంహౌస్‌ల్లో.. పేదలు మూసీ మురుగులోనా..?
మూసీ ప్రక్షాళన, అక్రమ కట్టడాలను తొలగించాలో లేదో ప్రజలే ఆలోచించాలని, మూసీలో బతకాలని ఎవరూ కోరుకోవడం లేదని, వారికి మంచి జీవితాన్ని ఇద్దామని భావిస్తే చాలామంది కాళ్లలో కట్టెలు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దలు జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, ఎర్రవల్లి, జన్వాడ ఫామ్ హౌస్‌లలో బతుకుతారని, పేదలు మాత్రం మూసీ మురుగులో అవస్థలు పడాలని ఆలోచిస్తున్నారని, మూసీ నదీ పరీవాహకాన్ని కుతుబ్‌షాహీలు, నిజాంలు ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.
This website uses cookies.