Ajay Devgn rents out office space
నెలకు అద్దె రూ.5.47 లక్షలు
బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ ముంబై అంధేరీలో 2,500 చదరపు అడుగులకు పైగా ఉన్న ఆఫీస్ స్థలాన్ని లీజుకు ఇచ్చారు. దీనిద్వారా నెలకు రూ.5.47 లక్షల అద్దె లభిస్తుంది. ఐదేళ్ల కాలానికి కుదిరిన ఒప్పందం కారణంగా ఆయనకు దాదాపు రూ.3 కోట్లకు పైగా అద్దె ఆదాయం వస్తుంది. అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఈ ఆఫీస్ యూనిట్ ను బాంబే డిజైన్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ కు అద్దెకు ఇచ్చినట్టు స్క్వేర్ యార్డ్స్ వెల్లడించింది.
2025 మే నుంచి 2030 ఏప్రిల్ వరకు ఈ అద్దె ఒప్పందం అమల్లో ఉంటుంది. సిగ్నేచర్ బై లోటస్ అనే భవనంలో ఉన్న ఈ స్థలం 2,545 చదరపు అడుగుల కార్పెట్ వైశాల్యం కలిగి ఉంది. ఈ లావాదేవీ మే 2, 2025న రిజిస్టర్ కాగా, రూ.85,500 స్టాంప్ డ్యూటీ, మరూ.1,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు పత్రాలు చూపిస్తున్నాయి. లావాదేవీకి సెక్యూరిటీ డిపాజిట్ రూ.16.42 లక్షలు చెల్లించారు. మూడేళ్ల తర్వాత అద్దె 5.47 లక్షల నుంచి రూ.6.29 లక్షలకు పెరుగుతుంది.
2023లో అజయ్ దేవ్‌గన్ ఒక్కొక్కటి 2,545 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడు ఆఫీస్ యూనిట్లను రూ. 30.35 కోట్లకు కొన్నారు. అంటే ఒక్కో యూనిట్ కు రూ.10.12 కోట్లు వెచ్చించారు. అందులో ఒక యూనిట్ ను ఇప్పుడు లీజుకు ఇచ్చారు. కొనుగోలు వ్యయం ఆధారంగా మొదటి మూడు సంవత్సరాలకు అద్దె ఆదాయం సుమారు 6.5%గా ఉంది. లీజు చివరి రెండు సంవత్సరాలలో దాదాపు 7.5%కి పెరిగిందని స్క్వేర్ యార్డ్స్ తెలిపింది. కాగా, అజయ్ ఈ భవనంలో మొత్తం ఐదు ఆఫీస్ యూనిట్లను రూ.45.9 కోట్లకు కొన్నారు.
This website uses cookies.