Categories: TOP STORIES

హైదరాబాద్ లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు..

  • గతేడాది విలువపరంగా రూ.13వేల కోట్లు డౌన్
  • ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడి

హైదరాబాద్ లో గతేడాది ఇళ్ల అమ్మకాల విలువ తగ్గింది. 2023తో పోలిస్తే 18 శాతం తక్కువగా ఈ విలువ నమోదైంది. 2023లో హైదరాబాద్ లో రూ.1.28 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు జరగ్గా.. 2024లో రూ.1.05 కోట్లకు తగ్గింది. అంటే దాదాపు రూ.13వేల కోట్ల మేర తక్కువగా అమ్మకాలు జరిగాయి. ఈ మేరకు వివరాలను ప్రాప్ ఈక్విటీ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. అయితే, దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాల విలువ 2024లో నికరంగా 12 శాతం పెరిగి రూ.6,73,000 కోట్లుగా ఉండడం గమనార్హం. 2023లో ఈ 9 ప్రధాన నగరాల్లో రూ.6,00,143 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. ఇక నగరాలవారీగా పరిస్థితి పరిశీలిస్తే.. గురుగ్రామ్‌లో 2023లో రూ.64,314 కోట్ల ఇళ్ల విక్రయాలు జరిగితే, 2024లో రూ.1,06,739 కోట్లకు పెరిగాయి.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో గతేడాది ఇళ్ల అమ్మకాలు 63 శాతం పెరిగి రూ.1,53,000 కోట్లకు చేరాయి. 2023లో అమ్మకాల విలువ రూ.94,143 కోట్లుగానే ఉంది. ముంబై మార్కెట్లో అమ్మకాల విలువ 13 శాతం పెరిగి రూ.1.38 లక్షల కోట్లకు చేరింది. నవీ ముంబైలోనూ 32 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు రూ.25,000 కోట్లకు చేరాయి. థానేలో 6 శాతం అధికంగా రూ.56,000 కోట్ల అమ్మకాలు 2024లో జరిగాయి. బెంగళూరు మార్కెట్లో రూ.85,000 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలు గతేడాది జరిగాయి. అంతకుముందు ఏడాది విక్రయాలు రూ.75వేల కోట్లతో పోల్చి చూస్తే 13 శాతం పెరిగాయి. చెన్నై మార్కెట్లో 5 శాతం వృద్ధితో ఇళ్ల విక్రయాలు రూ.20,000 కోట్లుగా ఉన్నాయి. కోల్‌కతాలో రూ.15,000 కోట్ల అమ్మకాలు చోటుచేసుకున్నాయి. 2023లో విక్రయాలు రూ.13,000 కోట్లతో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. పుణెలో అమ్మకాల విలువ కేవలం ఒక శాతం క్షీణించి రూ.76,000 కోట్లుగా ఉంది. 2023లో ఇక్కడ రూ.77,000 కోట్ల విక్రయాలు జరిగాయి.

This website uses cookies.