ఏయే సేవలను పొందవచ్చు?
తెలంగాణలో భూ సమస్యలకు కారణమైన ధరణి స్థానంలో నాణ్యమైన సేవలు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ఆర్‌వోఆర్ చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో సామాన్య రైతాంగంతో పాటు ఏ ఒక్కరికీ తమ భూ హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూసేందుకు, అన్ని విషయాల్లో పారదర్శకత పాటించే విధంగా, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా నూతన భూభారతి -2025 చట్టాన్ని ప్రభుత్వం రూపొందించింది. దీనికి అనుగుణంగా భూ భారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా రైతులు, భూ యజమానులు పారదర్శకంగా, వేగవంతంగా తమ భూముల వివరాలను తెలుసుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, వారసత్వ నమోదు లాంటి సౌకర్యాలను పొందే వీలు కల్పించారు. దీర్ఘకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా భూ భారతి పోర్టల్ పని చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
భూ భారతి పోర్టల్ లో ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయి? రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కు సంబంధించిన వివరాలు ఏంటి? దస్తావేజు రిజిస్ట్రేషన్‌కు మార్గదర్శకాలు ఏంటి? వంటి విషయాలు రియల్ ఎస్టేట్ గురు పాఠకుల కోసం ప్రత్యేకం..
భూ భారతి పోర్టల్ సేవలు..
1. రిజిస్ట్రేషన్
2. మ్యుటేషన్
3. అప్పీల్ అండ్ రివిజన్
4. ఆర్‌వోఆర్ సవరణలు
5. వ్యవసాయేతర భూమిగా మార్పు
భూ భారతి పోర్టల్ అందిస్తున్న సమాచారం
1. ఈ చలాన్
2. ఈసీ వివరాలు
3. నిషేధిత భూములు
4. భూ హక్కుల వివరాలు
5. భూముల మార్కెట్ విలువ
6. రిజిస్టర్డ్ దస్తావేజు వివరాలు
భూభారతిలో ఏయే సందర్భాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
1. భూముల క్రయవిక్రయాలు
2. భూమి బహుమతి
3. భూముల విభజన
4. భూ బదలాయింపు
5. భూముల కౌలు
6. భూముల తనాఖా
7. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ
8. అగ్రిమెంట్‌తో కూడిన జీపీఏ
9. భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ రద్దు, సవరణ దస్తావేజులు
రిజిస్ట్రేషన్ కు ఏయే ధృవపత్రాలు అవసరం.
1. పట్టాదార్ పాస్ బుక్
2. ఒరిజినల్ ఈ స్టాంప్స్ ఈ చలాన్
3. విక్రయదారుడి, కొనుగోలుదారుడి పాన్ కార్డులు( ఒకవేళ పాన్ కార్డు లేకపోతే ఫార్మ్ 61 సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది ).
4. క్రయ విక్రయదారుల ఆధార్ కార్డులు
5. ఇద్దరు సాక్ష్యులు
దస్తావేజు రిజిస్ట్రేషన్ దరఖాస్తు విధానం
స్టెప్ 1 – డేటా ఎంట్రీ
స్టెప్ 2 – స్టాంప్ రిజిస్ట్రేషన్ ఇతర ఫీజులు చెల్లింపు
స్టెప్ 3 – ఈ చలాన్ అండ్ దస్తావేజు కీలక వివరాలు డౌన్‌లోడ్ చేసుకోవాలి
స్టెప్ 4 – స్లాట్ బుక్ చేసుకోవడం
స్టెప్ 5 – సబ్‌మిట్ చేయడం ద్వారా డిపార్ట్‌మెంట్‌కు పంపడం.
రిజిస్ట్రేషన్‌కు ఎక్కడికి వెళ్లాలి?
భూ భారతి పోర్టల్‌లో దస్తావేజు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత.. స్లాట్ బుకింగ్ ప్రకారం తహసీల్దార్ లేదా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ సమయంలో ఎవరెవరు ఉండాలి?
విక్రయదారుడు, కొనుగోలుదారుడు, ఇద్దరు సాక్ష్యులు తప్పనిసరిగా ఉండాలి.
డాక్యుమెంట్‌పై సాక్షిగా ఎవరు సంతకం చేయాలి?
కొనుగోలు, విక్రయదారులు సాక్షి కింద సంతకం చేయకూడదు. ఇతర వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు. అది కూడా 18 ఏండ్ల వయసు నిండిన వ్యక్తి సాక్షి సంతకం చేయాల్సి ఉంటుంది.
రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఎప్పుడు వస్తుంది?
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన రోజే.. ఒరిజినల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మీ చేతికి అందుతుంది.
పేమెంట్ అయ్యాక రిజిస్ట్రేషన్ అప్లికేషన్‌ను ఎడిట్ చేయొచ్చా?
రిజిస్ట్రేషన్ తేదీ వరకు అప్లికేషన్‌ను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉంది.
భూ భారతి పోర్టల్‌లో ఇతర సమాచారం..
భూముల మార్కెట్ విలువ – సర్వే నంబర్ల ఆధారంగా భూముల మార్కెట్ విలువలు తెలుసుకోవచ్చు.
భూ వివరాలు – సర్వే నంబర్ లేదా పాస్ బుక్ నెంబర్ ఆధారంగా భూ హక్కుల వివరాలు తెలుసుకోవచ్చు.
నిషేధిత భూములు – గ్రామాల వారిగా నిషేధిత భూముల వివరాలు తెలుసుకోవచ్చు.
భూ భారతి అధికారిక వెబ్‌సైట్.. https://bhubharati.telangana.gov.in