బెంగళూరు అద్దెలపై సోషల్ మీడియాలో చర్చ
బెంగళూరు అద్దెల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా? అక్కడ అద్దెల కంటే డిపాజిట్లే కళ్లు బైర్లు కమ్మేలా చేస్తాయి. ఇంటి యజమానులు డిపాజిట్ కింద కనీసం 6 నెలల నుంచి 10 నెలల అద్దె వసూలు చేస్తుంటారు. దీని గురించి ఇటీవల సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వస్తున్నాయి. తాజాగా బెంగళూరులో ఓ ఇంటి యజమాని తన 3 బీహెచ్ కే ఇంటిని అద్దెకు ఇద్దామని భావించి ఓ ప్రకటన పోస్ట్ చేశాడు. అద్దె నెలకు రూ.లక్ష అని, డిపాజిట్ గా రూ.8 లక్షలు చెల్లించాలని పేర్కొన్నాడు.
ఎలక్ట్రానిక్ సిటీ, సర్జాపుర రోడ్ మధ్య తూర్పు ఐటీ కారిడార్ వైపు ఉన్న ఈ అపార్ట్ మెంట్ 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. రూ.8 లక్షలు ఉంటే మా ఊళ్లో భూమి కొనేసుకోవచ్చు అని ఒకరు రాస్తే.. రూ.8 లక్షల డిపాజిట్ ఏంటి స్వామీ అని మరొకరు సెటైర్ వేశారు. పూర్తిగా ఫర్నిష్ చేసినందుకు 8 లక్షలు, సెమీ ఫర్నిష్డ్ కు రూ.5 లక్షల డిపాజిట్ తీసుకుంటారా? నిబంధనలు అనేవి పట్టవా? మీకు దురాశ పెరుగుతూనే ఉందని మరొకరు ఆవేదన వ్యక్తంచేశారు.
భారతదేశ టెక్ రాజధాని అయిన బెంగళూరు చాలా కాలంగా భారీ అద్దెలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలు అద్దెదారులకు అనుకూలమైన పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, బెంగళూరు మాత్రం అధిక డిపాజిట్ సంస్కృతిని కొనసాగిస్తూనే ఉంది. ఆస్తి ధరలు పెరుగుతున్నందున, నగరం నిరంతరం పని చేసే నిపుణుల వలసలను చూస్తున్నందున, ఇంటి యజమానులు భద్రత, పెట్టుబడి రక్షణను ముఖ్య కారణాలుగా పేర్కొంటున్నారని నిపుణులు అంటున్నారు. బెంగళూరులో అద్దె ఆస్తులకు అధిక డిమాండ్ కారణంగా, ఇంటి యజమానులు నిబంధనలను నిర్దేశించే స్థితిలో ఉన్నారని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు.