ఔటర్ రింగ్ రోడ్డు.. హైదరాబాద్ మహానగరానికే మణిహారం. ఓఆర్ఆర్ నిర్మాణం తరువాత భాగ్యనగరం రూపురేఖలే మారిపోయాయి. గ్రేటర్ సిటీ చుట్టూ 158 కిలోమీటర్ల మేర విస్తరించిన ఔటర్ రింగ్ రోడ్డు మౌలికవసతుల కల్పనకు దోహదం కల్పించింది. అయితే ఔటర్ కు గ్రిడ్ రోడ్లు లేకపోవడం నిర్మాణరంగానికి అడ్డింకిగా మారుతోంది. ఓఆర్ఆర్ కు రెండు వైపులా అప్రోచ్ రోడ్లను నిర్మించాలని రియల్ రంగ నిపుణులు చాలా కాలంగా కోరుతున్నారు. ఓఆర్ఆర్ గ్రిడ్ రోడ్డు నిర్మాణంతో భారీ సంఖ్యలో నివాస ప్రాజెక్టులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు రెండు వైపులా నాలుగు లైన్లలో సర్వీసు రోడ్లు ఉన్నాయి. ఈ సర్వీసు రోడ్లకు రెండు వైపులా అటు ఇటు కిలోమీటరు మేరకు గ్రోత్ కారిడార్ ను ఏర్పాటు చేసింది హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అధారిటీ. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఇక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇస్తుండటంతో ఇక్కడ గ్రిడ్ రోడ్లు చాలా కీలకం అని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు నుంచి ప్రతి అరకిలోమీటర్ పరిధిలో ఈ గ్రిడ్ రోడ్లు సమాంతరంగా ఉంటాయి. ఇలా మొత్తం 158 కిలోమీటర్ల మేర రెండు వైపులా గ్రిడ్ రోడ్ల కోసం మాస్టర్ ప్లాన్ లో పొందుపర్చారు. ప్రస్తుతం హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో వందల సంఖ్యలో నిర్మాణాలు, లేఅవుట్లు వెలుస్తున్నాయి. చాలా వరకు నిర్మాణ ప్రాజెక్టులకు గ్రిడ్ రోడ్ల నిర్మాణం పెద్ద సమస్యగా మారుతోంది. సర్వీస్ రోడ్లకు అనుసంధానంగా అప్రోచ్ రోడ్లు లేకపోవడంకో కనెక్టివిటీ సమస్యగా మారింది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రియల్ ఎస్టేట్ అభివృద్దికి గ్రిడ్ రోడ్లు కీలకమని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఔటర్ చుట్టూ నివాస, వాణిజ్య నిర్మాణాలు, లేఅవుట్లు పుట్టుకొస్తుండటంతో గ్రిడ్ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. నిధుల సమస్యతో ఇన్నాళ్లు హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ గ్రిడ్‌రోడ్లపై దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. నిర్మాణరంగం కాస్త నెమ్మదించిన ఇటువంటి సమయంలోనైనా గ్రిడ్ రోడ్లను అభివృద్ది చేస్తే రియల్ రంగానికి చేయూతనిచ్చినట్లు అవుతుందని రియాల్టీ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: వడ్డీ రేట్ల తగ్గింపు.. రియల్టీకి ఊపు తెచ్చేనా?
గత కొన్నాళ్లుగా ఔటర్ చుట్టూ భారీగా నివాస ప్రాంతాలతో పాటు వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు వెలుస్తున్నాయి. రింగ్ రోడ్డు చుట్టూ ఇంకా వేలాది ఎకరాలు అందుబాటులో ఉండటంతో భారీ రియల్ ప్రాజెక్టుల కోసం సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. సర్వీసు రోడ్లకు సమాంతరంగా గ్రిడ్ రోడ్డు లేకపోవడం వల్ల ప్రస్తుతం వేలాది ఎకరాలు భూములు ఉన్నా వినియోగంలోకి రావడం లేదు. కొన్ని నిర్మాణ సంస్థలు సొంత భూముల్లో హెచ్‌ఎండీఏ అనుమతులతో గ్రిడ్ రోడ్లను తామే నిర్మించుకుంటున్నాయి. గ్రోత్ కారిడార్ పరిధిలోకి వచ్చే 316 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో సుమారు 78,086 ఎకరాలు అందుబాటులో ఉందని లెక్కలు చెబుతున్నాయి. గ్రిడ్ రోడ్ల నిర్మాణంతో ఈ భూమి మొత్తం ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం చేసే వీలుందనీ, నిర్మాణరంగం అభివృద్ధికి ఇది కీలకంగా మారుకుందనీ రియాల్టీరంగ నిపుణులు అంటున్నారు.
హైదరాబాద్ నగరం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు పైకి చేరేందుకు 32 రేడియల్ రహదారులను నిర్మించాలనే ప్రతిపాదనలు ఉండగా ఇందులో 18 వరకు పూర్తి చేశారు. మిగతా రేడియల్ రోడ్లను నిర్మించడంతో పాటు ఓఆర్ఆర్ కు అనుసంధానం అయ్యే విధంగా అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని సైతం త్వరితగతిన చేపట్టాలని రియల్ రంగ నిపుణులు కోరుతున్నారు. దీని వల్ల ఓఆర్‌ఆర్ పరిధిలో మరింత అభివృద్ధి జరుగుతుందనీ.. ప్రధానంగా భారీ నిర్మాణ ప్రాజెక్టులు వస్తే అందరికి అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తాయని రియాల్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.