Categories: TOP STORIES

ఎన్ని కోట్లకు కంగనా బంగ్లా విక్రయం

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రౌత్ ముంబై బాంద్రా హిల్ పాలి హిల్ లోని తన బంగ్లాను రూ.32 కోట్లకు విక్రయించారు. నిర్మాణ ఉల్లంఘనలకు పాల్పడినట్లు నాలుగేళ్ల క్రితం వార్తల్లోకెక్కిన బంగ్లాను కంగనా అమ్మేశారు. 2017 సెప్టెంబర్లో రూ.20 కోట్లు వెచ్చించి ఆమె ఈ బంగ్లాను కొనుగోలు చేశారు. 3,075 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లాకు 565 చదరపు అడుగుల పార్కింగ్ స్థలం ఉంది. కంగనా నుంచి ఈ ప్రాపర్టీని తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న కమలిని హోల్డింగ్స్ భాగస్వామి శ్వేతా బతిజా కొన్నారు. అమ్మకపు రిజిస్ట్రేషన్ ఈనె 5న జరిగింది. ఇందుకోసం కొనుగోలుదారు రూ.1.92 కోట్ల స్టాంపు డ్యూటీ, రూ.30వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు.

కాగా, 2020 సెప్టెంబర్ లో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కంగనా ఇంటిని పాక్షికంగా కూల్చివేసింది. అనధికారికంగా నిర్మాణం చేపట్టారని ఈ చర్యకు దిగింది. దీనిపై తాను పరిహారం పొందాల్సి ఉందని 2023లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా పేర్కొన్నారు. అయితే, తాను ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నానని, పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచే పరిహారం ఇస్తారు కాబట్టి తనకు ఇప్పుడు ఎలాంటి పరిహారం వద్దని ఇటీవల చెప్పారు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుండి బీజేపీ ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్ తనకు రూ.91 కోట్ల విలువైన ఆస్తులన్నట్టు ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు. ఇందులో రూ.28.7 కోట్ల చరాస్తులు మరియు రూ.62.9 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.

పాలి హిల్ తో బాలీవుడ్ అనుబంధం..

పాలి హిల్ అనేది చాలా మంది బాలీవుడ్ తారలు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు గృహాలను కొనుగోలు చేసిన ప్రీమియం ప్రాంతం. ఇక్కడ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టుల్లో చదరపు అడుగు ధర రూ.లక్ష కంటే ఎక్కువగానే ఉంటుంది. పాలి హిల్ దివంగత సునీల్, నర్గీస్ దత్, దివంగత రిషి కపూర్, నీతూ సింగ్, గుల్జార్, ఇమ్రాన్ ఖాన్, అమీర్ ఖాన్, సంజయ్ దత్ వంటి పలువురు బాలీవుడ్ తారలకు నిలయంగా ఉంది.

This website uses cookies.