ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం ఏది అంటే.. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా అని ఠక్కున చెబుతారు. అయితే, ఇకపై ఈ సమాధానం మారిపోనుంది. బుర్జ్ ఖలీఫానే తలదన్నేలా సౌదీ అరేబియా జెడ్డా టవర్ నిర్మాణం సాగుతోంది. ఈ భవనానికి సంబంధించిన నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీనిని కింగ్ డమ్ ఆఫ్ టవర్ అని కూడా పిలుస్తారు. ఇది పూర్తయితే.. బుర్జ్ ఖలీఫాను వెనక్కి నెట్టి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా నిలుస్తుంది. 3,281 అడుగుల ఎత్తైన ఈ టవర్ నిర్మాణాన్ని జెడ్డా ఎకనామిక్ కంపెనీ మళ్లీ ప్రారంభించింది. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా కంటే ఇది 568 అడుగుల ఎక్కువ ఎత్తు ఉండనుంది.
విలాసవంతమైన హోటల్ తోపాటు ఆఫీస్ స్థలాలు, సర్వీస్ అపార్ట్ మెంట్లు, లగ్జరీ కండోమినియంలు, ప్రపంచంలోనే ఎత్తైన అబ్జర్వేటరీ కలిగి ఉండేలా దీనిని నిర్మిస్తున్నారు. ఈ టవర్ మొత్తం వైశాల్యం దాదాపు 5.30 లక్షల చదరపు మీటర్లు.. అంటే 5.7 మిలియన్ చదరపు అడుగులు. ఈ టవర్ మొదటి దశకు 20 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా. ఈ భవన నిర్మాణంలో గ్రీన్ టెక్నాలజీ, గ్రీన్ మెటీరియల్స్ ఉపయోగిస్తారు. టవర్ పైకి ఎక్కి చూస్తే.. మూడు వైపులా ఎర్ర సముద్రపు అందాలు ఆస్వాదించొచ్చు. ఇక ఈ భవనం స్కై టెర్రస్ 30 మీటర్ల వ్యాసంతో ఉంటుంది. 157వ అంతస్తులో ఉండే ఈ టెర్రస్ ప్రజలకు తెరిచి ఉంటుంది. పైగా ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీ కూడా.
This website uses cookies.