2019 దాకా హెచ్ఎండీఏకు చిరంజీవులు పూర్తి స్థాయి కమిషనర్ గా ఉండేవారు. దీంతో, ఆయన అక్రమ లేఅవుట్లపై సమరభేరి మోగించారు. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనకూడదనే ప్రచారమూ చేశారు. కానీ, ఆయన బదిలీ తర్వాత హెచ్ఎండీఏ అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టలేదు. దీంతో, విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు పుట్టుకొస్తున్నాయి.
హైదరాబాద్ నగరం చుట్టూ విస్తరించి ఉన్న హెచ్ఎండీఏ ప్రాంతమంతా కలిపితే దాదాపు 7,200 కి.మీ. దాకా ఉంటుంది. ఇందులో ఏడు జిల్లాలు.. 70 మండలాలు.. 1032 గ్రామాలున్నాయి. ఇంత పెద్ద పరిధిలో.. అక్రమ నిర్మాణాల్ని నియంత్రించాల్సిన సిబ్బంది మాత్రం 53 మంది మాత్రమే ఉన్నారు. గతంలో కమిషనర్ గా చిరంజీవులు ఉన్నప్పుడే అక్రమ నిర్మాణాలపై సమరభేరి మోగించారు. కానీ, ఆ తర్వాత హెచ్ఎండీఏకు పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో అక్రమ నిర్మాణాల్ని అరికట్టడం దాదాపు అసాధ్యమైంది. అంతెందుకు 111 జీవో ప్రాంతంలో 84 గ్రామాలున్నాయి. ఇందులో పలు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలున్నాయి. అయినా, డెమాలిషన్ బృందాలు లేకపోవడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి కనిపిస్తోంది. పైగా, హెచ్ఎండీఏ సిబ్బంది అక్రమ నిర్మాణాల్ని నేలమట్టం చేయడానికి ఇతర విభాగాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.
<div class=”point”>111 జీవో ప్రాంతంలో సుమారు మూడు వేలకుపైగా అక్రమ నిర్మాణాలున్నాయని సమాచారం. ఇందులో నలభై వరకూ విద్యాసంస్థలు, 300 వరకూ లేఅవుట్లు ఉండటం గమనార్హం. అయితే, వీటిని అరికట్టడంలో హెచ్ఎండీఏ పెద్దగా దృష్టి పెట్టడం లేదు. మరి, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏకు పూర్తి స్థాయి కమిషనర్ని నియమిస్తే.. అక్రమ నిర్మాణాల్ని నియంత్రించే అవకాశం ఉంటుంది. లేకపోతే, రానున్న రోజుల్లో వీటి సంఖ్య గణనీయంగా పెరిగే ప్రమాదముంది</div>