- ట్రెడా ప్రాపర్టీ షో 11వ ఎడిషన్..
హైటెక్స్ లో.. అక్టోబరు 1 నుంచి 3 దాకా..
డెవలపర్లు రాయితీల్ని ప్రకటించే అవకాశం
అక్కడే బ్యాంకులు రుణాలిచ్చే ఆస్కారం - రూ. 30 లక్షలు- రూ. 5 కోట్ల ధర గల ప్రాజెక్టుల సమాచారం
లేఅవుట్లు, వ్యక్తిగత గ్రుహాలు, విల్లాల వివరాలు
ఎవర్ గ్రాండ్ ప్రభావం రియల్ రంగంపై పడదు
(కింగ్ జాన్సన్ కొయ్యడ)
హైదరాబాద్లో రియల్ రంగం ఏటా 34 శాతం అభివృద్ధి చెందుతోందని ట్రెడా అధ్యక్షుడు చలపతిరావు రాయుడు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో ట్రెడా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.30 నుంచి రూ.45 లక్షల్లోపు ధర గల అందుబాటు గృహాల ప్రాజెక్టులు నగరంలో పాతిక నుంచి ముప్పయ్ వరకూ ఆరంభమవుతున్నాయని వెల్లడించారు. కరోనాను సమర్థంగా అధిగమించిన తొలి రియల్ మార్కెట్‌గా హైదరాబాద్ దేశంలోనే ఖ్యాతినార్జించిందని చెప్పారు.
హైదరాబాద్లో ఇళ్ల కొనుగోలును సులభతరం చేసేందుకు ప్రప్రథమంగా భారీ స్థాయిలో ప్రాపర్టీ షో నిర్వహించిన ఘనత ట్రెడాకే దక్కుతుందన్నారు. అసలు ప్రాపర్టీ షో ఎలా నిర్వహించాలి? రేటు ఎంత పెట్టాలి? సిసలైన కొనుగోలుదారులకు సరైన ప్రాపర్టీల సమాచారం అర్థమయ్యేలా ఎలా అందించాలి? వంటి అంశాల్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటామన్నారు. ప్రతిఏటా ప్రాపర్టీ షోలో మార్పులు చేర్పులు చేస్తూ సరికొత్త రీతిలో ప్రాపర్టీ షోను డిజైన్ చేస్తున్నామని తెలిపారు. ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో ప్రాపర్టీ షోలను చేపడుతూ ఇతరులకు మార్గదర్శకంగా నిలిచామని చెప్పారు. అతి తక్కువ రేటుకే ఇందులో స్టాళ్లను అందజేస్తున్నామని.. వీటి ద్వారా వచ్చే సొమ్ములో అధిక శాతం కొనుగోలుదారులకు చేరుకోవడానికి అవసరమయ్యే ప్రచారం కోసమే వినియోగిస్తామని వివరించారు.
రెరా ప్రాజెక్టుల్లోనే కొనాలి..
సెక్రటరీ జనరల్ సునీల్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి రియల్ ఎస్టేట్ చక్కటి ఆప్షన్ అని అన్నారు. సొంతిల్లు ఉండాలనే విషయాన్ని ఇటీవల ఏర్పడిన కొవిడ్ ద్వారా అనేక పాఠాల్ని నేర్చుకున్నామని.. ప్రతిఒక్కరూ ఇల్లు కొనాలనే విషయం అర్థమైందన్నారు. నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక ప్రకారం.. 2021 ప్రథమార్థంలో కొత్త ఇళ్ల అమ్మకాల్లో 150 శాతం పెరిగిందని తెలిపారు. ఐటీ స్థలం విషయానికి వస్తే.. 3.2 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని వివిధ సంస్థలు లీజుకు తీసుకున్నాయని వివరించారు. గత మూడేళ్ల నుంచి మార్కెట్ మెరుగ్గా కొనసాగుతుంది కాబట్టి, రానున్న రోజుల్లో ఇదే విధంగా మార్కెట్ పయనిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రెరాలో నమోదైన ప్రాజెక్టుల్ని మాత్రమే కొనుగోలు చేయాలని ప్రకటించారు. కష్టార్జితంతో ఫ్లాట్లు కొన్న తర్వాత పోలీసులు, కోర్టుల చుట్టూ తిరిగే దుస్థితి ఎవరికీ రాకూడదంటే.. రెరా ప్రాజెక్టుల్లో కొనాలని సూచించారు.
చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా..
హైదరాబాద్లో అనేక సంస్థలు ప్రాపర్టీ షోలను నిర్వహిస్తున్నాయని.. కానీ, తమ షో ప్రత్యేకత ఏమిటంటే.. పెద్ద, చిన్న అనే తారతామ్యం లేకుండా ప్రతిఒక్క బిల్డర్ ఈ మూడు రోజుల ప్రదర్శనలో పాల్గొంటారని ట్రెడా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మేకా విజయ్ సాయి తెలిపారు. తమ ట్రెడాలో సభ్యులు కానివారికీ ఇందులో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. ట్రెడాలో సుమారు 300 మంది సభ్యులున్నారని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో తమ మొదటి ప్రాపర్టీ షోను మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, తర్వాతి షోను కిరణ్ కుమార్ రెడ్డి ఆరంభించారని గుర్తు చేశారు. అప్పటివరకూ ప్రాపర్టీ షోలను నగరంలో ఎక్కడపడితే అక్కడ నిర్వహించేవారని.. కనీసం పార్కింగ్ కోసం కూడా స్థలం ఉండేది కాదన్నారు. అలాంటిది, తాము హైదరాబాద్లో ప్రప్రథమంగా ప్రాపర్టీ షో కోసం హైటెక్స్ ను ఎంచుకున్నామని తెలిపారు. ఏటా కొన్ని ఎన్జీవో సంస్థలకు ఉచితంగా రెండు, మూడు స్టాళ్లను అందజేస్తున్నామని చెప్పారు.
11వ ప్రాపర్టీ షో..
తెలంగాణలో అతిపెద్ద ప్రాపర్టీ షో తమదేనని ట్రెడా కోశాధికారి శ్రీధర్ రెడ్డి అభివర్ణించారు. బిల్డర్లు, ఆర్థిక సంస్థలు, నిర్మాణ సామగ్రి సరఫరాదారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు. ఈ షోను సుమారు లక్ష చదరపు అడుగుల్లో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇందులో కనీసం ఐదు వందల నుంచి వెయ్యి లోపు ప్రాజెక్టుల సమాచారం లభిస్తుందన్నారు. రెండేళ్ల క్రితం వరకూ.. హైటెక్స్ చుట్టుపక్కల ఫ్లాట్లు కొనాలంటే యాభై, అరవై లక్షల్లోపు లభించేవి. కానీ, నేడో.. అదే హైటెక్ సిటీ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం వెళితే తప్ప దొరకని పరిస్థితి నెలకొందని తెలిపారు. భూముల ధరలు అంతగా పెరగడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతమైతే బడ్జెట్ అపార్టుమెంట్ల కోసం శంషాబాద్, నార్సింగి, కొంపల్లి తర్వాత మేడ్చల్, ఘట్ కేసర్, నాగార్జునసాగర్ రోడ్డు వరకూ వెళ్లాల్సి వస్తుందని వివరించారు. ఇంకా, ఇంటి కొనుగోళ్లలో ఆలస్యం చేస్తే మరింత దూరం వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడే ప్రమాదముందన్నారు. కాబట్టి, ఎలాంటి ఆలస్యం చేయకుండా సొంతింటి కలను త్వరగా సాకారం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.