ఒకప్పటి శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం నగరంలో కలిసిపోయాయి. పైగా, కొంతకాలం నుంచి ప్లాట్లు కొనేవారి సంఖ్య పెరుగుతున్నది. ఈ క్రమంలో పది, పదిహేనేళ్ల క్రితం వేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొనేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈమధ్య కాలంలో వీటికి అధిక ఆదరణ పెరుగుతోంది.
అధిక శాతం మంది రియల్టర్లు బూమ్ సమయంలో శివారు ప్రాంతాల్లో లేఅవుట్లు వేశారు. అప్పట్లో గజానికి రెండు నుంచి ఐదు వేలలోపే చాలామంది కొనుగోలు చేశారు. ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం మానివేయడంతో అందులో పిచ్చి మొక్కలూ మొలిచాయి. ప్లాటు చూద్దామంటే రాళ్లు కూడా పాతిలేవు. అలా మిగిలిపోయిన ప్లాట్లకు అనూహ్య రీతిలో గిరాకీ పెరిగింది. దీంతో, నగరంలో చాలామంది వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. బౌరంపేట్ నుంచి బడంగ్ పేట్, శంకర్ పల్లి టు శామీర్ పేట్, రాజేంద్రనగర్ నుంచి రామోజీ ఫిలిం సిటీ, నార్సింగి టు నాగోలు దాకా పాత లేఅవుట్లలో మిగిలిపోయిన ప్లాట్లకు రెక్కలొచ్చేశాయి. వాటిని విక్రయించి చాలామంది గేటెడ్ కమ్యూనిటీల్లో ప్లాట్లను కొనేవారూ పెరిగారు.
* కరోనా నేపథ్యంలో.. అపార్టుమెంట్లలో నివసించి విసిగిపోయిన వారిలో కొంత శాతం మంది వ్యక్తిగత ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కాస్త దూరంగా వెళ్లయినా ప్రశాంతంగా ఓ ఇల్లు కట్టుకుని నివసించాలనే నిర్ణయానికొచ్చారు. ఇందుకోసం సాయం చేయడానికి వైద్ ఆర్కిటెక్ట్స్ వంటి ప్రొఫెషనల్ సంస్థలూ ముందుకొస్తుండటం విశేషం. ప్రస్తుతం ప్లాట్లు కొనేవారు ఎక్కువగా బస్సు సౌకర్యం ఉన్న ప్రాంతాల వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. ప్రధానంగా బోడుప్పల్, ఘట్ కేసర్, శామీర్ పేట్, మేడ్చల్, కొంపల్లి, బౌరంపేట్, కొల్లూరు, శంకర్ పల్లి, నార్సింగి, శంషాబాద్, ఆదిభట్ల, రామోజీ ఫిలిం సిటీ వంటి ప్రాంతాల్లో వేసిన పాత లేఅవుట్లలో ప్లాట్లను కొనేవారి శాతం పెరిగింది.
* రీసేల్ ప్లాట్ల అమ్మకాల్లో మాయాజాలం చేసే ఏజెంట్లు లేకపోలేదు. కొందరు పాత లేఅవుట్లలో గిరాకీ లేకపోయినా కృతిమంగా రేటు పెంచేస్తున్నారు. దీనికి ఆయా ప్లాట్ల యజమానులూ అంగీకారం తెలుపుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అట్టి యజమానులు ఊహించిన దానికంటే అధిక రేటుకు మధ్యవర్తులు ప్లాట్లను విక్రయిస్తూ అధిక లాభాల్ని ఆస్వాదిస్తున్నారు. కాబట్టి, ఇలాంటి వారి పట్ల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.