- అసలైన బిల్డర్లు అడుగు వెనక్కీ
- ఎక్కడికక్కడే హండ్రెడ్ పర్సంట్ స్కీమ్ ప్రాజెక్టులు
- చోద్యం చూస్తున్న తెలంగాణ రెరా అథారిటీ
ఔను.. మీరు చదివింది నిజమే! యూడీఎస్ అమ్మకాలు రాష్ట్రమంతటా క్యాన్సర్ లా వ్యాపిస్తోంది. దీంతో గత రెండు, మూడు దశాబ్దాల నుంచి హైదరాబాద్ నిర్మాణ రంగం మీద ఆధారపడిన బిల్డర్లు.. కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించాలంటే అడుగు ముందుకేయలేని పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా చూస్తే.. హైదరాబాద్ మార్కెట్ మెరుగ్గా ఉంది. అన్ని నగరాల కంటే మన భాగ్యనగర రియల్ రంగమే త్వరగా కోలుకుంది. అయినప్పటికీ, సంప్రదాయ డెవలపర్లు కొత్త ప్రాజెక్టుల్ని ప్రారంభించడానికి ఎందుకు సాహసం చేయడం లేదు?
హైదరాబాద్ నిర్మాణ రంగంలో అనుభవజ్ఞులైన బిల్డర్ల సంఖ్య ఎక్కువే ఉన్నారు. వీరిలో అధిక శాతం ఓ పద్ధతి ప్రకారం నిర్మాణాల్ని చేపట్టుకుంటూ ముందుకెళ్లేవారే. అపార్టుమెంట్ కట్టేందుకు ఎక్కడైనా స్థలం లభిస్తే.. అక్కడి మార్కెట్ పరిస్థితుల్ని క్షుణ్నంగా అధ్యయనం చేసి అడుగు ముందుకేసేవారు. ఈ క్రమంలో బిల్డింగ్ ప్లాన్లు సిద్ధం చేసి.. స్థానిక సంస్థల నుంచి అనుమతులన్నీ తెచ్చుకుని నిర్మాణ పనుల్ని ఆరంభించేవారు. ప్రాజెక్టు స్థాయిని బట్టి ప్రకటనల్ని విడుదల చేసేవారు. అయితే, గత కొంతకాలం నుంచి ఇందుకు భిన్నమైన పోకడ హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఈ కొత్త విధానంలో.. ఏజెంట్లే బిల్డర్లు అవుతున్నారు. ప్లాట్లను అమ్మే రియల్టర్లు డెవలపర్లుగా మారుతున్నారు. వీరికి అపార్టుమెంట్లను కట్టిన చరిత్ర లేదు. పేరెన్నిక గల ప్రాజెక్టుల్ని కట్టిన దాఖలాల్లేవు. అయినా, వీరిలో చాలామంది వెనకా ముందు చూడకుండా.. అధిక నిష్పత్తికి అంగీకరించి.. ఎక్కువ మొత్తం అడ్వాన్సు చెల్లించి.. స్థల యజమానులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.
సగం రేటుకే..
ఆతర్వాత వెంటనే ఆయా భూమిని ఫ్లాట్లుగా మార్చేసి విక్రయిస్తున్నారు. స్థానిక సంస్థల అనుమతి లేదు.. రెరా పర్మిషన్ లేదు.. ఇష్టం వచ్చిన రేటుకు ఫ్లాట్లను అమ్మేస్తున్నారు. కొల్లూరులో ఓ సంప్రదాయ బిల్డర్ చదరపు అడుక్కీ రూ.5000 నుంచి రూ.6,000కి విక్రయించాల్సి వస్తే.. వీళ్లేమో ముందే వంద శాతం సొమ్ము తీసుకుని రూ2,500 నుంచి 3,000కే అమ్మేస్తున్నారు. కొనేవారు సైతం బిల్డర్ల బ్యాక్ గ్రౌండ్ తనిఖీ చేయకుండా.. కేవలం ఏజెంట్ల మాటల్ని నమ్మి తమ కష్టార్జితాన్ని వీరి చేతిలో పోస్తున్నారు. కేవలం ఆకర్షణీయమైన రేటు గురించి ఆలోచిస్తున్నారే తప్ప సకాలంలో ఫ్లాటును అందజేస్తారా? నాణ్యతా ప్రమాణాల్ని పాటిస్తారా? తదితర విషయాల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
నగరం నలువైపులా..
హైదరాబాద్‌లో రెండేళ్ల క్రితమే పురుడుపోసుకున్న ఈ యూడీఎస్ స్కీమ్ దందా.. నేడు రాష్ట్రమంతటా క్యాన్సర్‌లా పాకింది. అధిక శాతం మంది ప్రజలేం చేస్తున్నారంటే.. తమ ఊర్లో ఉన్న పొలం లేదా స్థలాన్ని అమ్మేసి.. దానికి తోడుగా చేతిలో ఉన్న కొంత సొమ్మును కలిపేసి.. ఇలా యూడీఎస్ బిల్డర్ల చేతిలో పోస్తున్నారు. వీరు కట్టిన సొమ్ముకు గాను అవిభాజ్యపు స్థలాన్ని రిజిస్టర్ చేస్తున్నారు. ఈ స్థలాన్ని చూసేసి కొనుగోలుదారులు ఫ్లాటే తమ చేతికొచ్చిందన్నట్లుగా సంతోషిస్తున్నారు. తమ సొమ్ముకు భరోసా లభించిందని భావిస్తున్నారు. కొన్నాళ్లయ్యాక కానీ వీళ్లకు అసలు విషయం అర్థం కాదు. న్యాయపరమైన సమస్యల వల్ల ఆయా భూమిలో అపార్టుమెంట్ కట్టేందుకు స్థానిక సంస్థలు అనుమతి మంజూరు చేయకపోతే అంతే సంగతులు. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాజెక్టుల్లో ఇలాగే సొమ్ము ఇచ్చి ఇరుక్కుపోయిన కొనుగోలుదారులు ఎక్కువే ఉన్నారు. తమ సొమ్ము ఎలా వెనక్కి వస్తుందో తెలియక తికమక పడుతున్నారు.
ఎందుకు వెనకడుగు?
ఇలా అక్రమ పద్ధతిలో ఫ్లాట్లను అమ్మడం కరెక్టు కాదని భావించే బిల్డర్లు కొత్త ప్రాజెక్టులను ఆరంభించేందుకు వెనకడుగు వేస్తున్నారు. స్థానిక సంస్థల అనుమతి చేతికి రాకముందే.. కొనుగోలుదారుల్నుంచి వంద శాతం సొమ్ము తీసుకోవడం కరెక్టు కాదని వీరు భావిస్తున్నారు. పైగా, తక్కువ మొత్తం కొనుగోలుదారుల వద్ద తీసుకుంటే.. నిర్మాణ నాణ్యతలో రాజీపడాల్సి ఉంటుంది. ఒకవేళ నాణ్యతగా కట్టకపోతే, భవిష్యత్తులో బయ్యర్ల వద్ద అప్రతిష్ఠ మూటగట్టుకోవాల్సి వస్తుంది. అందుకే, అధిక శాతం సంప్రదాయ బిల్డర్లు కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.
యూడీఎస్ ఎక్కువగా..
పశ్చిమ హైదరాబాద్లోని తెల్లాపూర్, కొల్లూరు, ఉస్మాన్ నగర్, వెలిమెల, పాటి ఘనపూర్, భానూరు, నందిగామ, మోకిలా, శామీర్ పేట్, మేడ్చల్, కీసర, రాంపల్లి, ఘట్కేసర్ వంటి ప్రాంతాల్లో అధికంగా జరుగుతున్నది. కాబట్టి, వీటిలో కొనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.