ఆఫీసు స్పేస్ ( Office Space ) గిరాకీలో హైదరాబాద్ మూడో స్థానానికి పడిపోయింది. 2021 మొదటి అర్థ సంవత్సరంలో ఆఫీసు స్పేస్ లీజింగులో బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలోనే దాదాపు 69 శాతం లీజింగ్ కార్యకలాపాలు జరిగాయి. సావిల్స్ ఇండియా అనే ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. 2021 జనవరి నుంచి జూన్ మధ్యలో ఆరు ప్రధాన నగరాల్లో 10.9 మిలియన్ల చదరపు అడుగుల ఆఫీసు స్థలాన్ని వివిధ సంస్థలు లీజుకు తీసుకున్నాయి. 2020తో పోల్చితే ఇది దాదాపు 38 శాతం అధికమని చెప్పొచ్చు.
బెంగళూరు 41 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం మేరకు లీజింగ్ కార్యకలాపాల్ని నిర్వహించింది. తర్వాతి స్థానంలో ఢిల్లీ-ఎన్సీఆర్ నిలిచింది. ఇక్కడ లీజుకు పలు సంస్థలు కేవలం 20 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని తీసుకున్నాయి. మూడో స్థానంలో ముంబై, హైదరాబాద్లు నిలిచాయి. మన వద్ద కేవలం 14 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని మాత్రమే పలు కంపెనీలు తీసుకున్నాయి.