ఫ్లాట్ అప్పగింతలో విఫలమైనందుకు రెరా నిర్ణయం
కొనుగోలుదారుకు ఫ్లాట్ అప్పగింతలో విఫలమైనందుకు హైదరాబాద్ కు చెందన ఓ బిల్డర్ కు రెరా రూ.20 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా కొనగోలుదారు చెల్లించిన రూ.1.2 కోట్లను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రెరా చైర్మన్ ఎన్. సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్. పూర్ణచంద్రరావు భాగస్వామిగా ఉన్న రిలయన్స్ డెవలపర్స్ బేగంపేటలో రిలయన్స్ ఎటెర్నిస్ పేరుతో ఓ ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో భాషం శోభారాణి అనే మహిళ రూ.1.32 కోట్లకు ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఇందులో దాదాపు 90 శాతం మొత్తం.. రూ.1.2 కోట్లను పూర్ణచంద్రరావు కుమారుడు రాజేశ్ కిరణ్ కు చెల్లించారు.
మిగిలిన మొత్తాన్ని ఐదో ఫ్లోర్ స్లాబ్, బ్రిక్ వర్క్, ప్లాస్టరింగ్ పూర్తయిన తర్వాత చెల్లించేలా అంగీకారానికి వచ్చారు. అయితే, 2019 నుంచి మిగిలిన మొత్తాన్ని తీసుకుని సేల్ డీడ్ చేయాలని కొనుగోలుదారు పలుమార్లు బిల్డర్ ను అడిగినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో రాజేశ్ భార్య, సంస్థ భాగస్వామి అయిన రవళి సీన్ లోకి వచ్చారు. తమ సంస్థను మూసివేస్తున్నామని.. ఎవరూ ప్రాపర్టీ కొనుగోలు కోసం ఒప్పందాలు చేసుకోవద్దంటూ పబ్లిక్ నోటీసు ఇచ్చారు. దీంతో కొనుగోలుదారు తెలంగాణ రెరాను ఆశ్రయించగా.. ఆమె చెప్పినవన్నీ అవాస్తవాలని రిలయన్స్ డెవలపర్స్ వాదించింది. రాజేశ్ కిరణ్ చేసుకున్న ఒప్పందానికి విలువ లేదని.. ఆ పత్రాలపై ఎవరూ సంతకాలు చేయలేదని పేర్కొంది.
అంతేకాకుండా ఫిర్యాదుదారు మిగిలిన మొత్తాన్ని చెల్లించడంలో విఫలమయ్యారని తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న రెరా.. రిలయన్స్ డెవలపర్స్ భాగస్వాములందరూ ఈ విషయంలో బాధ్యులేనని స్పష్టంచేసింది. ఫిర్యాదుదారు చెల్లించిన రూ.1.2 కోట్ల మొత్తాన్ని 10.85 శాతం వార్షిక వడ్డీతో 45 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ సంస్థకు రూ.20,02,762 జరిమానా విధించింది.