- ఈ ఏడాది 10-15 మిలియన్ చ. అడుగుల మేర జరిగే ఛాన్స్
- కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడి
ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో హైదరాబాద్ దూసుకెళ్తోంది. ఈ ఏడాది మన భాగ్యనగరం ఈ విభాగంలో అత్యధిక వృద్ధి నమోదు చేస్తుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కొలియర్స్ ఇండియా’ అంచనా వేసింది. అలాగే ఢిల్లీలో సైతం ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఇదే విధంగా జరుగుతుందని పేర్కొంది. ఈ రెండు నగరాల్లో 10-15 మిలియన్ చదరపు అడుగుల చొప్పున గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ కార్యకలాపాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ లీజింగ్ బలంగా ఉంటుందని.. మొత్తమ్మీద 65-70 మిలియన్ చదరపు అడుగుల మేర లీజింగ్ నమోదు కావొచ్చని అంచనా వేసింది.
ఈ ఆరు నగరాల్లో 2024లో స్థూల ఆఫీస్ లీజింగ్ 66.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉండగా.. ఈ ఏడాది 65-70 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటుందని అంచనా వేసింది. ఈ ఏడాది స్థూల ఆఫీస్ స్పేస్ డిమాండ్‌లో మూడింట ఒక వంతు బెంగళూరు నుంచే ఉంటుందని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ ఎండీ అర్పిత్ మెహరోత్రా తెలిపారు. జీసీసీలు, ఇంజనీరింగ్, తయారీ సంస్థలు, ఫ్లెక్స్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్ల నుంచి డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. ముంబై, చెన్నై పుణెలలో 5-10 మిలియన్ చదరపు అడుగుల చొప్పున డిమాండ్ ఉండొచ్చని చెప్పారు.