- 2030 నాటికి 200 మిలియన్ చదరపు అడుగుల స్పేస్
- దేశంలో 18 శాతం వాటా
- సీబీఆర్ఈ, హైసియా సంయుక్త నివేదికలో వెల్లడి
ఆఫీస్ మార్కెట్లో హైదరాబాదే రారాజుగా నిలుస్తోంది. ప్రస్తుతం 134 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ కలిగి ఉన్న భాగ్యనగరం.. దేశ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో 15 శాతం వాటా కలిగి ఉంది. 2030 నాటికి ఇది 200 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని.. తద్వారా దేశ ఆఫీస్ మార్కెట్లో 18 శాతం వాటా సొంతం చేసుకుంటుందని సీబీఆర్‌ఈ, దక్షిణాసియా, హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) సంయుక్త నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ సంస్థల నుంచి ఆఫీస్ స్పేస్‌కు బలమైన డిమాండ్ నెలకొందని, 2014 నుంచి చూస్తే హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ పరిమాణం మూడొంతులు పెరిగినట్టు తెలిపింది.
విస్తృతమైన మౌలిక వసతులు, నైపుణ్య మానవ వనరుల లభ్యతతో హైదరాబాద్ భారత దేశ రియల్ ఎస్టేట్‌కు కీలక వృద్ధి కేంద్రంగా మారినట్టు తెలిపింది. టెక్నాలజీ, బీఎఫ్‌ఎస్‌ఐ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు (జీసీసీ) హైదరాబాద్ ముఖ్య ఎంపికగా ఉన్నట్టు వెల్లడించింది. హైదరాబాద్ ఆఫీస్ లీజింగ్‌లో టెక్నాలజీ రంగం 31 శాతం వాటాతో అగ్రగామిగా ఉన్నట్టు తెలిపింది. లీజుపరంగా జీసీసీలకు బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో అతిపెద్ద కేంద్రంగా ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. టెక్నాలజీ, ఫార్మా, బయో టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇలా వివిధ రంగాల్లో జీసీసీలను హైదరాబాద్ ఆకర్షిస్తున్నట్టు పేర్కొంది.