రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసే విషయంలో మన భాగ్యనగరం వెనకబడింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల డేటాను పరిశీలిస్తే ఈ అంశంలో హైదరాబాద్ ఆరో స్థానంలో నిలిచింది. ఐదేళ్ల వ్యవధిలో అనుమతి పొందిన ప్రాజెక్టుల్లో కేవలం 74 శాతం మాత్రమే పూర్తి చేయగలిగినట్టు అన్ రాక్ సంస్థ విడుదల చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.
వాస్తవానికి తెలంగాణలో 2017 జూలై 31 నుంచి రెరా అమల్లోకి వచ్చినా.. ఎవరూ దానిని అంతగా పట్టించుకోలేదు. బిల్డర్లు తమ ప్రాజెక్టులను రెరాలో నమోదు చేయకపోవడం, నమోదు చేసినవారు కూడా అందుకు కట్టబడి ఉండకపోవడం వంటివి జరిగాయి. అలాగే ప్రీలాంచ్ వ్యవహారాలు విచ్చలవిడిగా సాగాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రెరాకు కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత ఇలాంటి అంశాలపై తీవ్రంగా దృష్టి సారించారు. దీంతో ఇకపై రెరాలో నమోదయ్యే ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.
వాస్తవానికి పెద్ద నిర్మాణ సంస్థలు పెద్ద పెద్ద ఆకాశహర్మ్యాలను సైతం మూడు నాలుగేళ్లలో పూర్తి చేస్తున్నాయి. అయితే, ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో రెరాకు, కొనుగోలుదారులకు మాత్రం పూర్తయ్యే గడువును ఐదేళ్లుగా పేర్కొంటున్నాయి. కానీ అంతకంటే ముందుగానే వాటిని పూర్తి చేసి కొనుగోలుదారులకు అందజేస్తున్నాయి. ఇలా చూసినా హైదరాబాద్ లో ఐదేళ్లయినా 26 శాతం ప్రాజెక్టులు పూర్తి కాలేదని నివేదికలో తేలింది. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 2018లో 1642 ప్రాజెక్టుల్లో 2.58 లక్షల యూనిట్లకు అనుమతి ఫొందగా.. 1409 ప్రాజెక్టుల్లోని 1.83 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇది 86 శాతం. హైదరాబాద్ విషయానికి వస్తే 110 ప్రాజెక్టుల్లో 24,125 యూనిట్లకు అనుమతి తీసుకోగా.. 81 ప్రాజెక్టులు మాత్రమే (74 శాతం) పూర్తయ్యాయి. అత్యధికంగా చెన్నైలో 90 శాతం ప్రాజెక్టులు పూర్తి కాగా.. అత్యల్పంగా కోల్ కతాలో 70 శాతం మాత్రమే పూర్తయ్యాయి.