ఇల్లు కొనేందుకు ఇదే రైట్ టైం
బిల్డర్లతో బేరమాడేందుకు మంచి అవకాశం
అమ్మకాలు తగ్గడంతో ధరలు తగ్గిస్తున్న బిల్డర్లు
ఫ్లాట్ ధర ఐదు నుంచి పది శాతం తగ్గింపు
ప్లాట్ల ధరలు తగ్గింపు.. పదిహేను శాతం
హైదరాబాద్ లో స్థిరాస్తి కొనుక్కోవాలని భావించేవారికిదే మంచి తరుణం. ఓపెన్ ప్లాట్ లేదంటే అపార్టుమెంట్ లో ఫ్లాట్ అయినా.. ఇప్పుడు కొనుక్కుంటే తక్కువ ధరకొచ్చే అవకాశముంది. ఎందుకో తెలుసా? హైదరాబాద్ లో గత ప్రభుత్వం ఉన్నంతకాలం.. ప్లాట్లు, ఫ్లాట్ల ధరల్ని డెవలపర్లు క్రమక్రమంగా పెంచేవారు. కానీ, గతేడాది అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి నగరంలో ఫ్లాట్స్ అమ్మకాలు తగ్గాయి. ఎన్నికల నేపథ్యంలో క్యాష్ ఫ్లో తగ్గడం ఇందుకో ప్రధాన కారణం అని చెప్పొచ్చు.
సాధారణంగా హైదరాబాద్లో నెలకు రెండు నుంచి మూడు వేల ఫ్లాట్ల దాకా అమ్ముడవుతాయి. కానీ, గత ఆరు నెలల్నుంచి నెలకు వెయ్యికి అటుఇటుగా అమ్మకాలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ప్రాప్ ఈక్విటీ విడుదల చేసిన తాజా నివేదికలో 2024 రెండో క్వార్టర్‌లో హైదరాబాద్‌లో ముప్పయ్ ఐదు శాతం అమ్మకాలు తగ్గాయని పేర్కొంది. కాబట్టి, ఇప్పుడు డెవలపర్లు ఫ్లాట్ల ధరలు పెంచే పరిస్థితిలో లేరు.. ఇంకా ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే, ప్రస్తుతం బయ్యర్స్ మార్కెట్ నెలకొంది కాబట్టి.. సొంతింటి కలను సాకారం చేసుకోవడానికిదే సరైన తరుణమని చెప్పొచ్చు.
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల తరువాత నిర్మాణ రంగం పుంజుకుంటుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో పరిస్థితుల్లో మార్పు రాలేదు. పైగా శంషాబాద్ మెట్రో, ఫార్మా సిటీ రద్దు వంటి ప్రకటనలతో హైదరాబాద్ రియాల్టీ పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ప్లాట్స్, ఫ్లాట్స్ కొనాలనేవారు వేచి చూసే ధోరణీని అవలంబిస్తున్నారు. అందుకే మొన్నటి వరకూ తాము చెప్పిన రేటే ఫైనల్ అన్న బిల్డర్లు.. ఇప్పుడు కొనుగోలుదారులు బేరమాడితే కొంత ధరను తగ్గిస్తున్నారు. హైదరాబాద్ లో ప్రాంతాన్ని, ప్రాజెక్టుని బట్టి.. ఫ్లాట్ ధర తక్కువలో తక్కువ 5 శాతం నుంచి 15 శాతం వరకు బిల్డర్లు తగ్గిస్తున్నారు. నిన్నటి వరకూ కోటి రూపాయలకు లభించే ఫ్లాటు.. ప్రస్తుతం 85 నుంచి 95 లక్షలకు దొరికే అవకాశముంది. అందుకే మార్కెట్ డౌన్ లో ఉన్న ఈ సమయంలోనే ప్లాట్ లేదా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కోండి.