కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు వరకూ.. హైదరాబాద్ నిర్మాణ రంగం నాలుగు పూవులు ఎనిమిది కాయలుగా వెలుగోందింది. అదే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా కొనసాగుతుందని రియాల్టీ నిపుణులు అంచనా వేశారు. కానీ, కాంగ్రెస్ సర్కార్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన భిన్నమైన స్టాండ్‌ను తీసుకుంది. గత ప్రభుత్వ హయంలో అనుమతులకు సంబంధించిన అక్రమాలు జరిగాయని రేవంత్ సర్కార్ గట్టిగా భావిస్తున్నట్లు కనిపించింది.
హైదరాబాద్‌లో కొత్త బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాలు, లగ్జరీ విల్లా ప్రాజెక్టుల అనుమతుల్ని పూర్తిగా నిలిపివేసింది. గత డిసెంబరు నుంచి కొత్త నిర్మాణాలకు అనుమతులు రాకపోవడంతో.. ఏం చేయాలో తెలియక కొందరు డెవలపర్లు ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా, గత నాలుగు నెలల్నుంచి హైదరాబాద్ రియాల్టీలో కొత్త ప్రాజెక్టులు ఆరంభం కాక.. పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పొచ్చు.
నగరానికి చెందిన పలువురు డెవలపర్లు.. డిసెంబరు లేదా జనవరిలో కొత్త ప్రాజెక్టులను ఆరంభించేందుకు ప్లాన్ చేశారు. కొందరు బిల్డర్లు అయితే ఏకంగా ఆర్కిటెక్ట్ డిజైన్లను కూడా సిద్ధం చేసుకున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అనుమతులైతే నిలిచిపోవు కదా అని వీరంతా భావించారు. కాకపోతే, హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ అరెస్టుతో ఒక్కసారిగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు విస్తుపోయారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త ఆకాశహర్మ్యాలు, లగ్జరీ విల్లాలకు అనుమతిని నిలిపివేయమని చెప్పడంతో.. బిల్డింగ్ కమిటీలు కూడా సమావేశం కాని దుస్థితి నెలకొంది. మొత్తానికి, దేశీయ రియాల్టీ దూసుకుపోతుంటే.. హైదరాబాద్ రియల్ రంగం మాత్రం వెలవెలబోతుంది. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని రియల్ నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు.
కనీసం 1500 కోట్ల ఆదాయం!
హైదరాబాద్‌లో గత ప్రభుత్వం అనుకున్న దానికంటే ఎక్కువ ఆకాశహర్మ్యాలకు అనుమతిని మంజూరు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, కొత్త అనుమతుల్ని నిలిపివేసిందనే వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే, ఎక్కడెక్కడ అనుమతుల్ని ఎక్కువగా ఇచ్చారో అధ్యయనం చేసి.. ఆయా ప్రాంతాల్లో కాకుండా.. ఇతర ప్రాంతాల్లోనైనా అనుమతుల్ని మంజూరు చేయవచ్చు కదా అని పలువురు డెవలపర్లు కోరుతున్నారు. ఒకవేళ, గత ప్రభుత్వం నిబంధనల్ని పాటించి అనుమతినివ్వకపోతే, కనీసం ఈసారైనా అన్నీ పక్కగా చూసుకుని ఇవ్వొచ్చు కదా అని అంటున్నారు.
మొత్తానికి, హైదరాబాద్ చుట్టూ దాదాపు వంద ప్రాజెక్టులు అనుమతుల కోసం వేచి చూస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో హైరైజ్ అనుమతి కోసం దాదాపు లక్ష చదరపు అడుగుల నిర్మాణానికి ఫీజుల రూపంలో బిల్డర్లు కోటీన్నర చెల్లిస్తారు. ఒక్కో బిల్డర్ పది లక్షల చదరపు అడుగుల స్థలాన్ని డెవలప్ చేసేందుకు.. జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీఏలకు పదిహేను కోట్లు చెల్లిస్తారు. ఇలా జీహెచెఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో సుమారు వంద ప్రాజెక్టులు అనుమతి కోసం వేచి చూస్తున్నాయని సమాచారం. వీటికిచ్చే అనుమతుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఎంతలేదన్నా పదిహేను వందల కోట్ల వరకూ ఆదాయం లభించే వీలుంది. మరి, ఇంతింత ఆదాయాన్ని ప్రభుత్వం ఎందుకు వదులకుంటుంది?
ఎంపీ ఎన్నికలే కారణమా?
హైదరాబాద్ నిర్మాణ రంగంపై పూర్తిగా అవగాహన ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకు రియల్ రంగంపై పెద్దగా దృష్టి సారించట్లేదు? ఎంపీ ఎన్నికలు ఉండటం వల్ల.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి.. ఎవరూ పెద్దగా పట్టించుకోరనేది ఆయన ఉద్దేశ్యమేమో అని కొందరు బిల్డర్లు భావిస్తున్నారు. ఏదీఏమైనా, రేవంత్ సర్కార్ రియల్ రంగం స్తంభించకుండా.. కొత్త నిర్మాణాలకు సక్రమ పద్ధతిలో కొత్త నిర్మాణాలకు అనుమతినివ్వాలని రియల్ పరిశ్రమ కోరుతున్నది.