Categories: TOP STORIES

పార్కింగ్ కోసం రంగలాల్ కుంట ధ్వంసం

  • చర్యలు తీసుకోవాలని సీఎంకు పర్యావరణవేత్త లుబ్నా సర్వత్ వినతి

హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని రంగలాల్ కుంట సరస్సు సమీపంలో పార్కింగ్ అవసరాల కోసం కొండను ధ్వంసం చేయడంపై పర్యావరణవేత్త లుబ్నా సర్వత్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఏ15 నుంచి సరస్సు బండ్ వరకు ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్ టీఎల్) జియో కో ఆర్డినేట్లు అసంపూర్తిగా ఉన్నాయని, దీనివల్ల ఆక్రమణలు జరగడంతోపాటు ఇన్ ఫ్లో చానెల్ ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 2017 నవంబర్, 2024లో అక్కడ పరిస్థితి ఎలా ఉందే తెలిపే గూగుల్ ఎర్త్ చిత్రాలను దానికి జోడించారు.

వేవ్ రాక్ భవనంతోపాటు జయభేరి ఆక్రమణల కారణంగా ఇన్ ఫ్లో చానెల్ తీవ్రంగా దెబ్బతిన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రంగలాల్ కుంట, దాని హైడ్రాలజీని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. అంతేకాకుండా జయభేరి సంస్థ, వేవ్ రాక్ కు కేటాయించిన సరస్సు దత్తత నోటిఫికేషన్లు రద్దు చేయాలని విన్నవించారు. బండ్ ను ఎవరు కూల్చవేశారో తెలుసుకునేందుకు విచారణ జరిపించాలని లుబ్నా అభ్యర్థించారు. ఈ విషయంలో నిర్మాణపరమైన ఉల్లంఘనలను నిర్ధారించడానికి రిజిస్టర్డ్ ప్రాజెక్టులు పరిశీలించాలని తెలంగాణ రెరాను కోరారు.

కాగా, నటుడు మురళీ మోహన్ కు చెందిన జయభేరి గ్రూప్ కు హైడ్రా నోటీసులు జారీచేసింది. రంగలాల్‌ కుంట ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఆ సంస్థ రెండు మీటర్లు ఆక్రమించి రేకులతో ఫెన్సింగ్‌ నిర్మించింది. స్థానికుల దీనిపై ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. సంస్థ ప్రతిని«ధులను పిలిపించి.. వారం రోజుల్లో ఆ ఫెన్సింగ్‌తో పాటు రేకులు తొలగించాలని స్పష్టంచేశారు. వాస్తవానికి రంగలాల్‌ కుంటకు అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేట్‌ వ్యక్తులు అష్టదిగ్భందనం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఐటీ కారిడార్‌లోని అన్ని చెరువులు నిండి జలకళను సంతరించుకున్నారు.

వేవ్‌రాక్‌ వంటి ఐటీ టవర్‌ను ఆనుకొని ఉన్న రంగలాల్‌ కుంటలోకి మాత్రం ఇప్పటికీ పూర్తి స్థాయిలో నీరు చేరలేదు. దీని ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లలో రేకులు ఏర్పాటు చేయడమే దీనికి కారణం. నానక్‌రాంగూడ సర్వే నెం.66లో రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో రంగలాల్‌ కుంట ఉంది. ఎఫ్‌టీఎల్‌తో కలుపుకొని 5 ఎకరాలకు పైగానే ఉంటుంది. వరద వస్తే నీరు ప్రవహించే విధంగా రోడ్డు కింది భాగంలో చానల్‌ ఏర్పాటు చేశారు. పై నుంచి నీరు రాకుండా నిర్మాణాలు ఉండటంతో రంగలాల్‌ కుంటకు పూర్తి స్థాయిలో నీరు చేరట్లేదు.

This website uses cookies.