Categories: TOP STORIES

సామాన్యులపైనేనా హైడ్రా ప్రతాపం?

హైడ్రా పనితీరుపై ప్రశంస‌లు-విమర్శలు

రెండు నెలల్లో 262 నిర్మాణాలను కూల్చిన హైడ్రా

ఎక్కువ‌గా సామాన్యుల ఇళ్ల కూల్చివేత‌

హైదరాబాద్‌లో హైడ్రా ఎంత సంచలనం సృష్టిస్తుందో అంతే వివాదాస్పదమవుతోంది. చెరువులను అక్రమంగా కట్టిన నిర్మాణాలపై హైడ్రా తన ప్రతాపం చూపిస్తోంది. హైడ్రా దెబ్బకు ఓ వైపు అక్రమార్కులు వణికిపోతుంటే మరోవైపు సామాన్యులు రోడ్డున పడుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవర్ని హైడ్రా వదిలిపెట్టడం లేదు. ఎన్ని ఒత్తిడులు, విమర్శలు, ఆరోపణలు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు. పైగా సందర్బం చిక్కినప్పుడల్లా అక్రమార్కులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు.

చెరువులు, కుంటలను కబ్జా చేసిన వారిని వదిలిపెట్టమని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. చెరువులను కబ్జా చేసిన వాళ్లు వారికి వారుగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. లేదంటే హైడ్రా రంగంలోకి దిగుతుందని, నిర్మాణాల్ని నేలమట్టం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ దగ్గర కొందరు ఫామ్‌ హౌస్‌లు కట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఫామ్ హౌస్‌లలోని డ్రైనేజీ నీరు జంట జలాశయాల్లోకి కలుపుతున్నారని చెప్పారు.

చెరువులు, కుంటల్ని ఆక్రమించి కట్టిన కట్టడాల వల్ల ఆకస్మిక వరదలు వ‌స్తున్నాయ‌ని అన్నారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్న సీఎం రేవంత్.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ పైనా, హైడ్రా చర్యల పైనా ఓ వైపు ప్రశంసలు వస్తుండగా, మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్ల తరబడి పట్టించుకోకుండా, అదీ ప్రభుత్వ రంగ సంస్థలనుంచి అన్ని అనుమతులు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నాక.. ఇప్పుడు హఠాత్తుగా వచ్చి కూలకొడతామంటే ఎలా అనే ప్రశ్నిస్తున్నారు చాలా మంది. బాడాబాబులు చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చితే పరవాలేదు గాని పైసా పైసా కూడబెట్టుకుని, అది సరిపోక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కట్టుకున్న ఇళ్లను కూలిస్తే సామాన్యుల పరిస్థితి ఏమిట‌ని నిలదీస్తున్నారు.

హైదరాబాద్ లో నిర్మాణాలను తొలగించడంపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పేదల ఇళ్లు కూల్చే ప్రభుత్వం.. ఇదేం ప్రభుత్వమంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌ను ప్రజలు నిలదీస్తున్నారు. ఇళ్లను కూల్చి బస్సులు ఫ్రీగా ఇస్తారా అంటూ మహిళలు సైతం తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను, ఆ తరువాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల పాటు ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లను పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఒక్కసారిగా అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించింది. వాటిని కూల్చొద్దని ఎవరు చెప్పడం లేదు.. కానీ అదే సమయంలో చెరువులను ఆక్రమించి ప్రభుత్వ భూములను కబ్జా చేసిన బడా బాబులపై ప్రతాపం చూపించాల్సిన హైడ్రా.. సామాన్యులపై మాత్ర‌మే కొరడా ఝుళిపించడం ఏమిట‌ని ప్రశ్నిస్తున్నారు.

కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే ఇళ్లను కూల్చడం దుర్మార్గమని మరికొందరు వాపోతున్నారు. ఇంటి సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేస్తున్నారని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండు నెలల్లో హైడ్రా మొత్తం 23 ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించిన 262 అనధికారిక నిర్మాణాలను కూల్చివేసి 111.72 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. రాంనగర్ మణెమ్మ గల్లీలో 3, గగన్ పహాడ్ అప్పా చెరువులో 14, అమీన్పూర్ పెద్ద చెరువు పరిధిలో 24, మాదాపూర్ సున్నం చెరువులో 42, దుండిగల్ కత్వా చెరువు పరిధిలో 13 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా తెలిపింది. అత్యధికంగా అమీన్ పూర్ లో 51 ఎకరాలు, మాదాపూర్ సున్నం చెరువులో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది హైడ్రా.

ఇందులో అత్యధికంగా సామాన్యులకు సంబంధించిన ఇళ్లను, నిర్మాణాలనే హైడ్రా కూల్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన బడాబాబులకు నోటీసులు ఇచ్చి తాత్సారం చేస్తున్న హైడ్రా సామాన్యుల ఇళ్లను మాత్రం హడావుడిగా కూల్చడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

ఈ క్రమంలోనే హైడ్రా అధికారులపై క్రమంగా సామాన్య ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండగా కొంత మంది స్థానికులు హైడ్రా అధికారులపై దాడులు చేయగా ఇప్పటికే పోలీసులు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. చాలా మంది హైడ్రాకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

ఒకవేళ తెలియక బఫర్ జోన్ లో సామాన్యులు ఇళ్లు నిర్మించుకుంటే వాటిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 58, 59 ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. అంతేకానీ ఇలా అక్రమ నిర్మాణాల పేరిట ఏళ్ల క్రితం నిర్మించుకున్న సామాన్యుల ఇళ్లను కూలగొట్టడంపై రోజు రోజుకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరి ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ మేరకు దృష్టి సారిస్తారన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

This website uses cookies.