ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికంటూ కీలకమైన వడ్డీ రేట్లు పెంచుతూ రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకోవడంతో ఆ మేరకు బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. దేశంలోని దిగ్గజ బ్యాంకులు వరుసగా వడ్డీ రేట్ల పెంపుపై ప్రకటనలు చేస్తున్నాయి. తాజాగా ప్రైవేటు బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐతోపాటు ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించాయి. దీంతో గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరగునున్నాయి.
ఆర్బీఐ రెపో రేటుతో లింకైన ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 8.10 శాతానికి పెంచుతున్నట్టు ఐసీఐసీఐ ప్రకటించగా.. రిటైల్ లోన్లపై తాము 6.90 శాతం వడ్డీ వసూలు చేయనున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ఇదే బాటలో పయనించనున్నాయి. నేడో రేపో అవి కూడా వడ్డీ రేట్ల పెంపుపై ప్రకటన చేయనున్నాయి.