- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిర్ణయం
రిజిస్టర్ చేసుకున్న నిర్మాణ కార్మికులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంచి కానుక ప్రకటించారు. ఢిల్లీలోని ప్రజా రవాణా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించారు. వారందరికీ ఉచితంగా బస్ పాస్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనివల్ల దేశ రాజధానిలో దాదాపు 10 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలగనుంది. ఈ కొత్త పథకాన్ని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ప్రకటించి, వంద మంది కార్మికులకు ఉచిత బస్ పాస్ లు అందజేశారు. ‘ఢిల్లీలో దాదాపు 10 లక్షల మంది కార్మికులు రిజిస్టర్ చేసుకున్నారు.
గత సంవత్సరంలో వీరందరికీ వివిధ పథకాల కింద కేజ్రీవాల్ సర్కారు దాదాపు రూ.600 కోట్లు అందజేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా నిర్మాణ కార్మికుల కోసం ఖర్చు చేసిన మొత్తాలతో పోలిస్తే ఇదే అత్యధికం’ అని సిసోడియా తెలిపారు. ఇప్పటికే ఢిల్లీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన కేజ్రీవాల్ సర్కారు తాజాగా నిర్మాణ రంగ కార్మికులకు ఈ పథకం ప్రకటించింది. దీనివల్ల ప్రతి కార్మికుడికి నెలకు రూ.1500 నుంచి 2వేల వరకు ఆదా కానుంది.