Categories: TOP STORIES

ఆర్ఆర్‌ఆర్ జంక్ష‌న్ పూర్త‌యితే.. అక్క‌డి ఇళ్ల‌కు మ‌స్తు గిరాకీ!

రియల్ ఎస్టేట్ లో గేమ్ చెంజర్ గా ట్రిపుల్ ఆర్

అభివృద్దికి కేరాఫ్ ట్రిపుల్ ఆర్ ఇంటర్ చేంజర్స్

రీజినల్ జంక్షన్స్ దగ్గర భారీగా మౌలిక వసతులు

మారిపోనున్న ట్రిపుల్ ఆర్ బాలానగర్ జంక్షన్

బాలానగర్ పరిసరాల్లో భారీగా రియల్ వెంచర్లు

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరానికి రీజినల్ రింగ్ రోడ్డు మరో మణిహారంగా మారబోతోంది. తెలంగాణ అభివృద్ధిలో ట్రిపుల్ ఆర్ గేమ్ ఛేంజర్ కానుందని రియల్ ఎస్టేట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం 347 కిలో మీటర్ల పొడవున 4 వరుసలతో నిర్మించే ఈ గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వేను రెండు భాగాలుగా నిర్మించనుండగా.. అందుకు సంబందించిన భూసేకరణ పనులు మొదలయ్యాయి.

హైదరాబాద్ నగరం చుట్టూ ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు ఉండగా.. దీని వెలుపల రీజినల్ రింగ్ రోడ్‌‌ నిర్మాణం జరగనుంది. ఔటర్ రింగ్ రోడ్‌కు వెలుపల 347 కిలో మీటర్ల మేర తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ ప్రాంతీయ రింగ్ రోడ్డు ఏర్పాటు అవుతోంది. రీజినల్ రింగ్ రోడ్‌ సూపర్ గేమ్ ఛేంజర్ అవుతుందని, ఈ ప్రాజెక్ట్ వస్తే రాష్ట్ర స్వరూపం మారిపోతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మూడేళ్లలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్.

రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో మొత్తం 12 ఇంటర్ చేంజర్స్ నిర్మించేలా డిజైన్ చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులతో కనెక్ట్ అయ్యే ఈ 12 ప్రాంతాల్లో భారీ జంక్షన్స్ ఏర్పాటు కానున్నాయి. అంతర్జాతీయస్థాయిలో నిర్మాణం జరుపుకోబోయే ఈ భారీ ఇంటర్ చేంజర్స్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ కు మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్స్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బెంగళూరు జాతీయ రహదారిపై బాలానగర్ సమీపంలో వచ్చే జంక్షన్ గురించి.

నేషనల్ హైవే 44 ను కనెక్ట్ చేస్తూ బాలానగర్ దగ్గర నిర్మించబోయే ఇంటర్ చేంజర్ చుట్టు పక్కల భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇటు షాద్ నగర్, అటు జడ్చర్ల వరకు పారిశ్రామికంగా అభివృద్ది చెందగా.. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు, బాలానగర్ దగ్గర వచ్చే భారీ జంక్షన్ తో ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందనుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే రీజినల్ రింగ్ రోడ్డు కు సంబందించి బెంగళూరు జాతీయ రహదారిపై బాలానగర్ కు కిలోమీటరు దూరంలో మార్కింగ్ చేయగా.. అందుకు సంబందించిన భూసేకరణ పనులు మొదలవ్వనున్నాయి. ఈ క్రమంలో బాలానగర్ చుట్టుపక్కల ప్రాంతాలు భవిష్యత్తులో ఊహించలేనంతగా మారిపోనున్నాయని రియాల్టీ వర్గాలు అంటున్నాయి. ట్రిపుల్ ఆర్ మార్కింగ్ తో బాలానగర్ సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంతమేర ఊపందుకుంది.

షాద్ నగర్, జెడ్చర్ల మధ్య మొన్నటి వరకు నేషనల్ హైవే ఫెసింగ్ తో ఎకరం 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఉండగా.. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు జంక్షన్ ఏర్పాటు కానుండటంతో ఇక్కడ ఎకరం 3 నుంచి 4 కోట్లకు పెరిగిందని చెబుతున్నారు. జాతీయ రహదారి నుంచి 5 కిలోమీటర్ల రేడియస్ లో ఎకరం 80 లక్షల నుంచి కోటీ 20 లక్షల మేర ధరలున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు పనులు మొదలైతే భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ట్రిపుల్ ఆర్ జంక్షన్ ఏర్పాటయ్యే బాలానగర్ కు సమీపంలోని షాద్ నగర్, బాలానగర్, జడ్చెర్ల లో ఇప్పటికే భారీ స్థాయిలో రియల్ వెంచర్లు వెలిశాయి. ఇక ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్ ఏర్పాటవుతుండటంతో భారీగా వెంచర్లు వేసేందుకు రియాల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం షాద్ నగర్ లో డీటీసీపీ లేఅవుట్ లో రియాల్టీ ప్రాజెక్టు, ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 15 వేల రూపాయల నుంచి 35 వేల రూపాయల వరకు ధరలున్నాయి.

ఇక బాలానగర్ లో చదరపు గజం 8 వేల రూపాయల నుంచి 22 వేల రూపాయల వరకు ప్లాట్ల ధరలున్నాయి. బాలానగర్ సమీపంలోని రాజాపూర్ లో చదరపు గజం 6 వేల రూపాయల నుంచి మొదలు 15 వేల రూపాయల వరకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ తరువాత జెడ్చర్ల లో డీటీసీపీ లేఆవుట్లలో చదరపు గజం 8 వేల రూపాయల నుంచి 24 వేల రూపాయల వరకు ధరలున్నాయి.

బాలానగర్ కు జెడ్చర్ల కు మధ్య సుమారు వెయ్యి ఎకరాల్లో ఏర్పాటైన పోలెపల్లి గ్రీన్ ఇండస్ట్రియల్ ఎస్ఈజెడ్ తో ఈ ప్రాంతం పారిశ్రామికంగా దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్ లను ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. అంతే కాకుండా ఈ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లు, లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటుకానున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీలు రీజినల్ రింగ్ రోడ్డుకు చేరువగా తమ ల్యాబ్‌లు, ఫ్యాక్టరీలను తరలించనుండటంతో ఇక్కడ మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయి.

ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో బాలానగర్ జంక్షన్ కనివినీ ఎరగుని రీతిలో అభివృద్ది చెందనుందని రియాల్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డుతో ఇటు హైదరాబాద్ కు, అటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనుండటంతో సామాన్య, మధ్య తరగతి వాళ్లు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో క్రమంగా బాలానగర్ నుంచి జెడ్చర్ల వరకు నిర్మాణ ప్రాజెక్టులతో పాటు భారీ స్థాయిలో వెంచర్లకు అవకాశం ఉంటుందని రియాల్టీ వర్గాలు చెబుతున్నాయి.

This website uses cookies.