హైదరాబాద్ అతివేగంగా అభివృద్ధి చెందుతున్నదన్న విషయం తెలిసిందే.. కాకపోతే, నగరంలో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయకపోతే.. రానున్న రోజుల్లో మరో బెంగళూరు తరహా మారే ప్రమాదముందని నరెడ్కో అధ్యక్షుడు రాజన్ బండేల్కర్ అభిప్రాయపడ్డారు. ఇటీవల నరెడ్కో కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి విచ్చేసిన ఆయన రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడుతూ.. హైదరాబాద్లో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజారవాణా వ్యవస్థ మీద దృష్టి సారించి అభివృద్ధి చేసిందన్నారు. ముంబైలో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్లను వెచ్చించిందని వెల్లడించారు. జపాన్ జైకా నిధుల్ని ఇందుకోసం వినియోగించారని తెలిపారు. నరెడ్కో సిల్వర్ జూబ్లీ సంబరాలు హైదరాబాద్లో జరుపుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. నిర్మాణ రంగంలో నైపుణ్యం గల నిపుణుల ఆవశ్యకత ఏర్పడిందన్నారు. 2070 నాటికల్లా నెట్ జీరో కార్బన్ కు తేవాలన్న లక్ష్యాన్ని భారత ప్రధానమంత్రి నిర్దేశించుకున్నారని తెలిపారు.