- మోమిన్‌పేట్‌లో గజం రూ.8,500.. వామ్మో!
- హైటెక్ సిటీ నుంచి 70 కిలోమీటర్లు
- నేరుగా రహదారి కూడా లేదు
- కొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి
- యూడీఎస్ బిల్డర్ల వద్ద కొనవద్దు
కింగ్ జాన్సన్ కొయ్యడ: హైదరాబాద్‌లో ఏటా నిర్మించే అపార్టుమెంట్లు ఎన్ని? అందులో కట్టే ఫ్లాట్ల సంఖ్య ఎంత? ఎంత మంది బిల్డర్లు కడతారు? వంటి విషయాల గురించి భూతద్ధంలో పెట్టి వెతికినా దొరకవు. జీహెచ్ఎంసీతో పాటు ఇతర కార్పొరేషన్లు, హెచ్ఎండీఏ, మున్సిపాలిటీలు వంటివన్నీ ఏటా ఎన్ని నిర్మాణాలకు అనుమతిని మంజూరు చేస్తాయనే విషయం ఎవరికీ పెద్దగా తెలియదు. పురపాలక శాఖ అధికారులూ ఈ సంఖ్యను కచ్చితంగా చెప్పలేరు. ఇక, నిర్మాణ సంఘాలు సరేసరి. కమిటీలో ఉండే సభ్యుల్లో ఒక్కొక్కరూ ఒక్కో సంఖ్య చెబుతుంటారు. దీంతో, వినేవారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఇంతకీ విషయం ఏమిటంటే..
మోమిన్‌పేట్‌లో గజం రూ.8,500?
ఏమిటీ.. మోమిన్‌పేట్‌లో గజం రూ.8,500? అని ఆందోళన చెందకండి. ఒక రియల్టర్ యూడీఎస్లో భాగంగా.. ప్రీలాంచ్ ఆఫర్‌గా గజానికి రూ.8,500 చొప్పున విక్రయిస్తున్నారు. వాస్తవానికి, అక్కడ గజానికి రూ.12 వేల దాకా రేటు ఉందట. ఈ రియల్టర్ మాత్రం బయ్యర్లకు మేలు చేద్దామనే ఉద్దేశ్యంతో.. ముందస్తుగా వంద శాతం సొమ్ము కడితే గజానికి రూ.8,500కే ఇస్తాడట. నగరానికి చేరువలో సొంతిల్లు కట్టుకోవాలని భావించేవారు.. ఇలాంటి ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టి నష్టపోకండి. హైటెక్ సిటీకి చేరువగా ఉన్నామంటూ ప్రచారం చేసే ఇలాంటి సంస్థల మాటల్ని గుడ్డిగా నమ్మవద్దు. మాదాపూర్ నుంచి మోమిన్పేట్కు ఎంతలేదన్నా డెబ్బయ్ కిలోమీటర్ల దూరం ఉంటుంది. పైగా, అనేక వంకర్లు టింకర్లు తిరిగి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి, ఇలాంటి మోసపూరిత ప్రచారాన్ని గుడ్డిగా నమ్మేసి కొనుగోలు చేయవద్దు. ఎందుకంటే, ఇలాంటి సంస్థలు ఏజెంట్లకు సుమారు పది శాతం దాకా కమిషన్ అందజేసి ప్లాట్లను విక్రయిస్తుంటాయి. కాబట్టి, ఇలాంటి సంస్థల మాయలో పడితే అంతే సంగతులు. మీరు పెట్టుబడి పెట్టి దాదాపు పదిహేను, ఇరవై ఏళ్లు వేచి చూడాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
70 శాతం ధర పెరిగిందా?
గత రెండు, మూడేళ్ల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్థలాల ధరలు విపరీతంగా పెరిగాయి. కరోనా కాలంలోనూ కొందరు రియల్టర్లు, మధ్యవర్తులు ధరల్ని పెంచేశారు. వీరేమో స్థలయజమానులు రేట్లు పెంచారని చెబితే.. బయ్యర్లు కొంటున్నారు కాబట్టి, ధరలు పెంచి చెబుతున్నామని భూయజమానులు చెబుతున్నారు. మొత్తానికి, ఈ రియల్ భూభాగోతంలో మధ్యతరగతి ప్రజలు సొంతిల్లు కొనుక్కోలేని దుస్ధితికి చేరుకున్నారు. నాలుగు, ఐదేళ్ల క్రితం దాకా.. నగర శివార్లలో కొన్ని నిర్మాణాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు నలభై లక్షలకే దొరికేవి. కానీ, నేడో డెబ్బయ్ లక్షలు పెట్టనిదే నాణ్యమైన ఫ్లాట్ దొరకని పరిస్థితి ఏర్పడింది. మరి, ఈ ఐదేళ్లలో ఉద్యోగుల జీతభత్యాలు డెబ్బయ్ శాతం పెరిగాయా? అంటే అదీ లేదు. మరెందుకు, నగరంలో ప్లాట్లు, ఫ్లాట్ల ధరలు పెరుగుతున్నాయంటే? హైదరాబాద్ అత్యద్భుతంగా అభివృద్ధి చెందడమే ప్రధాన కారణం అంటున్నారు. నిజంగానే భాగ్యనగరం ఐదేళ్ల క్రితంతో పోల్చితే.. అంత అద్భుతంగా అభివృద్ధి చెందిందా? మెట్రో రైలు, కొన్ని ఫ్లయ్ ఓవర్లు, పలు చోట్ల స్లిప్ రోడ్డులు రాగానే నగరం దేదీప్యమానంగా వృద్ధి చెందిందని భావించాలా?
ప్లాటు లేదా ఫ్లాట్ కొంటున్నారా?
మీరు ప్లాటు లేదా ఫ్లాట్ కొనాలని నిర్ణయించుకున్నారా? అయితే, ఏజెంట్లు చెప్పే మాటల మీదే పూర్తిగా ఆధారపడకుండా.. మార్కెట్‌ను నిశితంగా పరిశీలించండి. అంత తీరిక లేకపోతే, రియల్ ఎస్టేట్ గురు వంటి నిపుణుల్ని సంప్రదించండి. ఒక ప్రాంతంలో ప్లాటుకు ఎంత పెట్టొచ్చు? ఫ్లాటుకు ఎంత పెట్టొచ్చనే విషయం అర్థమవుతంది.