- మధ్యతరగతి, పెట్టుబడిదారుల్నుంచి
- రూ.300 కోట్లు కొల్లగొట్టే స్కెచ్
- 150 ఎకరాలు ఫర్ సేల్
- నో డీటీసీపీ, రెరా పర్మిషన్
- గజానికి రూ.8,500
- ఈ సంస్థ సభ్యత్వాన్ని నిర్మాణ సంఘం తక్షణమే రద్దు చేయాలి!
స్థానిక సంస్థల అనుమతి అక్కర్లేదు.. రెరా పర్మిషన్ తీసుకోనక్కర్లేదు.. కానీ, ధర తక్కువని చెప్పి కోట్లు కొల్లగొట్టవచ్చని హైదరాబాద్‌లోని పలు రియల్ సంస్థలు నిరూపిస్తున్నాయి. అక్రమంగా సంపాదించిన సొమ్మును ఏం చేయాలో? ఎలా పంచుకోవాలో? తెలియక కొన్ని కంపెనీల్లో భాగస్వామ్యులు కొట్టుకుంటున్న సందర్భాలున్నాయి. ఒకరి మీద ఒకరు పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టుకుంటున్నవి కళ్ల ముందే కనిపిస్తున్నాయి. తాజాగా, ఒక రియల్ సంస్థ.. ఐరా రియాల్టీ శంకర పల్లి తర్వాత వచ్చే మోమిన్‌పేట్‌లో 150 ఎకరాల స్థలాన్ని చూపెట్టి.. ధర తక్కువంటూ.. అటు కొనుగోలుదారులు.. ఇటు పెట్టుబడిదారుల్నుంచి సొమ్ము కొల్లగొట్టే ప్రయత్నం ఆరంభించింది.
రెరా అనుమతి తీసుకుని విక్రయిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఆ అనుమతి లేకుండా విక్రయించడం వల్లే అసలు సమస్య ఏర్పడింది. ఇలా అక్రమంగా విక్రయించిన ప్లాట్లలో వచ్చిన సొమ్మును సంస్థ రాజకీయ నాయకులకు విరాళంగా కూడా అందజేస్తుందని సమాచారం. ఇటీవల కాలంలో మంత్రి కేటీఆర్‌ని కలిసి రూ25 లక్షల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కి కూడా అందజేశారీ సంస్థ ప్రతినిధులు. దీంతో, ఈ సంస్థను ప్రశ్నించడానికీ పురపాలక శాఖ, రెరా ఉన్నతాధికారులూ వెనకడుగు వేసే పరిస్థితి ఏర్పడే అవకాశం లేకపోలేదు.
హైటెక్ సిటీ నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని శంకర్ పల్లి మోమిన్‌పేట్ రోడ్డులో చీమలదారి ప్రాంతంలోని బంజరు భూమిలో విలాసవంతమైన గృహాల్ని నిర్మించాలన్నది ఐరా రియాల్టీ ప్రధాన ఉద్దేశ్యం. వినడానికిది ఎంతో వినసొంపుగా ఉంది. అక్కడ పర్యావరణ అనుకూలమైన గృహాల్ని నిర్మించాలనేది సంస్థ లక్ష్యం. లక్ష్యం మంచిదే.. ఎవరూ కాదనలేరు.. నగరానికి దూరంగా ప్రశాంతంగా నివసించాలని కోరుకునేవారికి ఇది చక్కగా పనికొస్తుంది. కాకపోతే, ఇంతటీ బడా ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించుకున్నప్పుడు.. ప్రజల్నుంచి పెట్టుబడి రూపంలో సొమ్మును సమీకరించాలని అనుకున్నప్పుడు.. హెచ్ఎండీఏ/ డీటీసీపీ రెరా అథారిటీ అనుమతి తీసుకుంటే ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదు. కొనుగోలుదారులూ ఎంచక్కగా కొనుక్కుంటారు. కాకపోతే, రెరా అనుమతి లేకుండా ఎలాంటి అమ్మకాలు చేయకూడదు. ఫలానా ప్లాటు లేదా ఫ్లాటు అమ్ముదామని ఎవరికీ చెప్పకూడదు. ప్రాజెక్టు గురించి ప్రకటనల్ని విడుదల చేయకూడదు. కానీ, ఐరా రియాల్టీ ఏం చేస్తోంది?