Categories: TOP STORIES

ఫామ్ ల్యాండ్ పేరిట.. గ్రీన్ వ్యాలీ టోకరా!

  • ఫాం ల్యాండ్ పేరుతో అక్రమ ఫ్లాట్లు
  • క‌ర్ట‌సీ.. జ‌న‌గామ మేక‌ల‌గ‌ట్టులో గ్రీన్ వ్యాలీ
  • పట్టించుకోని అధికార యంత్రాంగం

ప్రజలు మోసపోకుండా చూడాల్సిన అధికారులే పట్టించుకోవట్లేదు. అనుమతి లేకుండా వేసిన వెంచర్ లో ప్లాట్ల విక్రయాలు జరుగుతున్నా కన్నెత్తి చూడట్లేదు. దీంతో పలువురు కొనుగోలుదారులు అక్రమ ప్లాట్లు కొని నిలువునా మోసపోతున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామ పరిధిలోని దాదాపు 17 ఎకరాల్లో గ్రీన్ వ్యాలీ సంస్థ ఫాం ల్యాండ్ పేరుతో ఏర్పాటైన వెంచ‌రే ఇందుకు చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌.

గ్రీన్ వ్యాలీకి ఎలాంటి అనుమతులే లేకున్నా.. అన్నీ ఉన్నట్టుగా చెప్పి కొనుగోలుదారులకు అంటగడుతోంది. ఈ విషయం తెలిసి అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. వాస్తవానికి డీటీసీపీ అనుమతి లేకుండా వెంచర్ ఏర్పాటు చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా అలా వెంచర్ వేస్తే వెంటనే అందులోని నిర్మాణాలు తొలగించడంతోపాటు ఆ వెంచర్ కి ఎలాంటి అనుమతులూ లేవని బోర్డులు ఏర్పాటు చేయాలి.

కానీ గ్రీన్ వ్యాలీ ఫాం ల్యాండ్ వెంచర్ వద్ద అధికారులు ఇలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో వారి సహకారంతోనే అక్రమార్కులు చెలరేగిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ‌లితంగా గ్రీన్ వ్యాలీ అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఫ్లాట్లు విక్రయిస్తోంది. అయితే, ఈ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయడం లేదని అధికారులు చెబుతున్నారు.

రియల్ వర్గాలు మాత్రం రిజిస్ట్రేషన్లు మామూలుగానే జరుగుతున్నాయని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో జనం ఇలాంటి అక్రమ వెంచర్ల బారిన పడి మోసపోకుండా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

This website uses cookies.