ప్రముఖ నిర్మాణ సంస్థ రాంకీ గ్రూప్ రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన జాయింట్ ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ లోని ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల రిజిస్ట్రేషన్ ను నిలిపివేసినట్టు హైకోర్టుకు హెచ్ఎండీఏ నివేదించింది. తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. పైగా సదరు భూమి యాజమాన్య హక్కులపై అసత్యాలు చెప్పిందని, ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు మోసపోకూడదనే ఉద్దేశంతో వాటి రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్టు వివరించింది.
శ్రీనగర్ గ్రామంలో 14 ఏళ్ల క్రితం డిస్కవరీ సిటీ పేరుతో రాంకీ సంస్థ ఆ ప్రాజెక్టు చేపట్టింది. టౌన్ షిప్ ను అభివృద్ధి చేయడం కోసం హెచ్ఎండీఏతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఒప్పందం ప్రకారం తమకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించకపోవడంతో గతేడాది ఆగస్టులో రాంకీ సంస్థకు హెచ్ఎండీఏ నోటీసులు జారీ చేసింది. వాటికి ఆ సంస్థ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని హెచ్ఎండీఏ.. రాంకీ సంస్థకు చెందిన ప్లాట్లు, విల్లాల రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని రాంకీ సంస్థ హైకోర్టులో సవాల్ చేసింది.
దీనిపై హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బి.లక్ష్మీ నరసింహారెడ్డి గత నెల 31న హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ‘డెవలప్ మెంట్ ప్రీమియం కింద కంపెనీ హెచ్ఎండీఏకు రూ.100 కోట్లు చెల్లించాలి. కానీ ఇప్పటివరకు రూ.25 కోట్లు మాత్రమే చెల్లించింది. అంతే కాకుండా ప్రతిపాదిత టౌన్ షిప్ కోసం చూపించిన 374 ఎకరాల భూముల్లో 130 ఎకరాల భూమిపై ఆ సంస్థకు హక్కులు లేవని తర్వాత మా పరిశీలనలో వెల్లడైంది. ఆయా భూములకు సంబంధించి వివాదాలు ఉన్నట్టు తేలింది’ అని అందులో పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి హెచ్ఎండీఏ, రాంకీ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్పెషల్ పర్సస్ వెహికల్ పేరుతో అనుమతులు పొందాల్సి ఉండగా.. అధికారులను తప్పుదోవ పట్టించి రాంకీ సంస్థ పేరుతోనే అనుమతులు పొందారని వివరించారు. ‘ప్రాజెక్టు నిలిపివేయాలని టెర్మినేషన్ నోటీసు ఇచ్చాం. రాంకీ సంస్థ సమాధానం సరిగా లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు నిలిపివేశాం’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో రాంకీ సంస్థ పిటిషన్ కొట్టివేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్.. తదుపరి విచారణను ఈనెల 7కి వాయిదా వేశారు.
This website uses cookies.