- 2024 చివరికి స్థిరాస్తి రంగంలోకి రూ.74వేల కోట్ల రాక
- మొత్తం పెట్టుబడుల్లో రియల్ వాటా 15 శాతం
- అనరాక్ నివేదిక వెల్లడి
రియల్ రంగంలోకి ప్రత్యామ్నాయ పెట్టుబడులు (ఏఐఎఫ్) వెల్లువెత్తాయి. 2024 డిసెంబర్ చివరినాటికి రూ.73,903 కోట్లకు చేరాయి. గతేడాది డిసెంబర్ నాటికి అన్ని రంగాల్లో ఏఐఎఫ్ లు కలిపి రూ.5,06,196 కోట్లు రాగా.. ఇందులో 15 శాతం వాటా రియల్ రంగంలోకి వచ్చినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తన తాజా నివేదికలో వెల్లడించింది. నిధుల్లేమితో ఇబ్బందులు పడుతున్న ప్రాజెక్టులకు ఏఐఎఫ్ పెట్టుబడులు జీవాన్నిస్తున్నాయని, డెవలపర్లకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని నివేదిక తెలిపింది. రియల్ ఎస్టేట్ తర్వాత అత్యధికంగా ఐటీ/ఐటీఈఎస్ రంగంలోకి రూ.30,279 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడులు వెళ్లాయి.
ఆ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.26,807 కోట్లు, ఎన్‌బీఎఫ్‌సీ రూ.21,929 కోట్లు, బ్యాంకులు రూ.21,273 కోట్లు, ఫార్మా రూ.18,309 కోట్లు, ఎఫ్‌ఎంసీజీ రూ.12,743 కోట్లు, రిటైల్ రూ.11550 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగం రూ.11,433 కోట్ల చొప్పున ఏఐఎఫ్ పెట్టుబడులను ఆకర్షించగా.. ఇతర రంగాల్లోకి రూ.2,77,970 కోట్ల పెట్టుబడులు వెళ్లాయి. రియల్ ఎస్టేట్ అభివృద్ధి పరంగా వివిధ దశల్లో ఉన్న నిధుల సమస్యకు ఏఐఎఫ్ రూపంలో పరిష్కారం లభించినట్టు అనరాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ పేర్కొన్నారు. సంప్రదాయ నిధుల సమీకరణ మార్గాల్లో ఇబ్బందులకు ఈ రూపంలో పరిష్కారం లభించినట్టు చెప్పారు.