రియల్ ఎస్టేట్ కొనుగోళ్లలో మహిళలు జోరుగా దూసుకెళ్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి రియల్ రంగమే సరైన ఎంపిక అని ఎక్కువ మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రియల్ రంగంలో వారి ప్రాతినిధ్యం పెరుగుతోంది. ప్రాపర్టీలు కొనుగోలు చేస్తున్న అతివల్లో దాదాపు 30 శాతం మంది పెట్టుబడుల కోణంలో ఆలోచిస్తుండగా.. 69 శాతం మంది తుది వినియోగం కోసం ప్రాపర్టీలు కొంటున్నారు. ఈ వివరాలు అనరాక్ నిర్వహించిన కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వే (2024 హెచ్2) లో వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 70 శాతం మంది పెట్టబడులు పెట్టడానికి రియల్ ఎస్టేట్ రంగం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పేర్కొన్నారు.
2022 ద్వితీయార్థంగా ఇది 65 శాతంగా ఉంది. కోవిడ్ కు ముందు 57 శాతంగా నమోదైంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పట్ల మహిళల ప్రాధాన్యత 2024 ద్వితీయార్థంలో గణనీయంగా తగ్గింది. 2022 ద్వితీయార్థంలో ఇది 20 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2024 ద్వితీయార్థంలో నిర్వహించిన సర్వేలో దాదాపు 52 శాతం మంది అతివలు రూ.90 లక్షలు కంటే ఎక్కువ ధర కలిగిన ప్రీమియం లేదా లగ్జరీ ఇళ్లకు మొగ్గు చూపించారు. 2022 ద్వితీయార్ధంలో జరిగిన సర్వేలో, దాదాపు 47% మంది మహిళా ప్రతివాదులు బడ్జెట్-కేటగిరీ ఇళ్లను ఎంచుకున్నారు. 2024లో దాదాపు 33% మంది మహిళా గృహ కొనుగోలుదారులు రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర గల ఆస్తుల కోసం ఆసక్తి ప్రదర్శించారు. 11 శాతం మంది రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల మధ్య ధర గల ఇళ్లను ఇష్టపడ్డారు.
8% మంది మహిళలు రూ. 2.5 కోట్ల కంటే ఎక్కువ ధర గల ఇళ్లకు ఓటేశారు. అలాగే నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీలకు డిమాండ్ పెరుగుతున్నట్టు సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న మహిళల్లో 18% కంటే ఎక్కువ మంది నిర్మాణంలో ఉన్న ఇళ్లను ఇష్టపడ్డారు. 2022 ద్వితీయార్థంలో ఇది 10 శాతంగా ఉంది. రెడీ-టు-మూవ్-ఇన్ ఇళ్ల పట్ల ఆసక్తి 2022 హెచ్2లో 48 శాతం ఉండగా.. తాజా సర్వేలో అది 29 శాతానికి తగ్గింది. కాగా, పెరుగుతున్న ఆర్థిక స్వాతంత్ర్యం, ఆదాయాలతో మహిళలు నమ్మకమైన పెట్టుబడిదారులుగా గృహ మార్కెట్‌కు వస్తున్నారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పూరి అభిప్రాయపడ్డారు.
This website uses cookies.