సగటు మనిషి తన జీవితంలో తీసుకునే అతిపెద్ద రుణం ఇంటి కోసమే. ఇది కనీసం 15 ఏళ్ల నుంచి 30 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తం అన్ని సంవత్సరాలు చెల్లించడం వల్ల చాలా ఎక్కువ మొత్తం వడ్డీ పడుతుంది. మనకు తెలియకుండానే తీసుకున్న రుణం కంటే దాదాపు రెట్టింపు పైనే చెల్లిస్తాం. ఈ నేపథ్యంలోఅవకాశం ఉన్నప్పుడు ఇంటి రుణం ముందుగా చెల్లించడం మంచిదేనా? అంటే.. ఔననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. మీకు అందుబాటులో డబ్బు ఉన్నప్పుడు ఇంటి రుణం తీర్చుకోవడం తెలివైన పని అని చెబుతున్నారు. అయితే, ఇంటి రుణం ముందుగా చెల్లించాలా లేదా అనే నిర్ణయం మీరు ఎంచుకున్న పన్ను విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది.
ఇంటి రుణం ముందస్తు చెల్లింపు.. ముఖ్యంగా పదవీ విరమణకు దగ్గరగా ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వారి ఆదాయ ప్రవాహం తగ్గకముందే బాధ్యతలను క్లియర్ చేయడంలో ఇది సహాయపడుతుంది. మొత్తం వడ్డీ భారాన్ని తగ్గించడంతో పాటు ముందస్తు చెల్లింపు రుణ కాలపరిమితిని తగ్గిస్తుంది. అలాగే క్రెడిట్ స్కోర్ ను మెరుగుపరుస్తుంది. పైగా ముందస్తు చెల్లింపు ఈఎంఐలను తగ్గించడంలో సహాయపడుతుంది. రుణగ్రహీత గృహ రుణాన్ని ముందస్తుగా చెల్లించినప్పుడు, అతిపెద్ద ప్రయోజనం మొత్తం వడ్డీ అవుట్‌గో తగ్గడం. వడ్డీని బాకీ ఉన్న అసలుపై లెక్కించినందున, ఒకేసారి చెల్లింపులు చేయడం వల్ల వడ్డీ వచ్చే బకాయి మొత్తం తగ్గుతుంది.
ఉదాహరణకు 20 సంవత్సరాల కాలవ్యవధికి 9% వడ్డీ రేటుతో రూ.50 లక్షల గృహ రుణాన్ని తీసుకుంటే.. రుణగ్రహీత ఐదు సంవత్సరాల తర్వాత రూ.5 లక్షలను ముందస్తుగా చెల్లిస్తే, మిగిలిన రుణ బ్యాలెన్స్ సుమారు రూ.39.35 లక్షలకు తగ్గుతుంది. ఫలితంగా భవిష్యత్ ఈఎంఐల వడ్డీ భాగం తగ్గుతుంది. బ్యాంక్ పాలసీని బట్టి రుణగ్రహీత ఈఎంఐ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు లేదా రుణ కాలపరిమితిని తగ్గించుకోవచ్చు. రుణగ్రహీత ఈఎంఐని మార్చకుండా ఉంచాలని ఎంచుకుంటే రుణ కాలపరిమితి 20 సంవత్సరాల నుంచి దాదాపు 15 సంవత్సరాలకు తగ్గుతుంది. తద్వారా వడ్డీ చెల్లింపులలో సుమారు రూ.16.30 లక్షలను ఆదా అవుతుంది.
This website uses cookies.