Categories: TOP STORIES

2024 మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌.. భార‌త రియ‌ల్ రంగానికి మ‌ళ్లీ మొండి చెయ్యి!

అంతా ఊహించిన‌ట్లే జ‌రిగింది. ఎప్ప‌టిలాగే కేంద్ర ఆర్థిక‌మంత్రి.. నిర్మాణ రంగానికి మొండిచేయి చూపెట్టింది. 2024 మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్ రియ‌ల్ రంగానికి ఉప‌యోగ‌ప‌డే ఎలాంటి భారీ ప్ర‌క‌ట‌న‌ల్ని చేయ‌లేదు. గ‌త ప‌దేళ్ల‌లో.. కేంద్ర ప్ర‌భుత్వం నిర్మాణ రంగానికి ప్ర‌త్య‌క్షంగా ప్ర‌యోజ‌నం చేకూర్చే ప్ర‌క‌ట‌న‌లేవీ పెద్ద‌గా చేయ‌లేద‌నే విష‌యాన్ని గ‌మ‌నించాలి. ఈ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో.. అంద‌రికీ గృహాలు అని అట్ట‌హాసంగా ఆరంభించినా.. ఆ త‌ర్వాత ఆ ప‌థ‌కం కాస్త నీరుగారిపోయింది. జీడీపీలో వ్య‌వ‌సాయం త‌ర్వాత అధిక శాతం వాటా క‌లిగి ఉన్న నిర్మాణ రంగానికి ప‌రిశ్ర‌మ హోదాను మంజూరు చేయాల‌ని ప‌దేళ్ల నుంచి కోరుతున్నా.. నేటికీ క‌నిక‌రించ‌లేదు. భ‌విష్య‌త్తులో ప్ర‌క‌టిస్తుంద‌నే ఆశ కూడా లేదు. అయినా, నిర్మాణ సంఘాలు ఎంతో ఆశ‌తో ఎదురు చూస్తున్నాయి. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో మౌలిక స‌దుపాయాల్ని అభివృద్ధి చేసేందుకు ప‌లు నిర్ణ‌యాల్ని మాత్రం తీసుకున్నారు.

మధ్యతరగతికి గృహనిర్మాణం – అద్దె ఇళ్లు లేదా మురికివాడల్లో నివ‌సించేవారిలో అర్హులైన వారికి సొంత ఇల్లు కొనుక్కోవ‌డానికి లేదా నిర్మించుకోవ‌డానికి ఒక ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని ఆరంభిస్తామ‌ని ఆర్థిక మంత్రి ప్ర‌క‌టించారు. దీని వ‌ల్ల స్టీలు, సిమెంటు, నిర్మాణ‌సామ‌గ్రి ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

పట్టణ ప్రాంతాలలో రవాణా ఆధారిత అభివృద్ధిపై దృష్టి పెడ‌తామ‌న్నారు. దీని వ‌ల్ల న‌గ‌రాల్లో హౌసింగ్ డిమాండ్ పెర‌గ‌డానికి అవ‌కాశ‌ముంది. కాక‌పోతే, బీజేపీ పాలిత రాష్ట్రాల‌కే ఈ ప‌థ‌కాన్ని ప‌రిమితం చేస్తారా? లేక అన్ని రాష్ట్రాల‌కు స‌మానంగా నిధుల్ని కేటాయిస్తారా? అనేది త్వ‌ర‌లో తెలుస్తుంది.
దేశంలో ఐకానిక్ టూరిస్ట్ సెంట‌ర్ల‌ను అభివృద్ధి చేస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. దీని వ‌ల్ల హోట‌ళ్లు,
రెస్టారెంట్ల‌తో ఆతిథ్య రంగం వృద్ధి చెంద‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. పర్యాటకం కోసం రాష్ట్రాలకు దీర్ఘకాలిక రుణాలను ప్రతిపాదించారు.
న‌గ‌రాల్లో మ‌రిన్ని మెట్రో రైళ్లు, న‌మోభార‌త్ రైళ్ల‌ను విస్త‌రిస్తామ‌ని చెప్పారు.
స్టార్టప్‌లకు పన్ను ప్రయోజనాన్ని మరో ఏడాది పొడిగించడం వ‌ల్ల‌ ఆఫీస్ రియల్ ఎస్టేట్ పునరుజ్జీవనం పొందే వీలుంది.
మధ్యంతర బడ్జెట్ రియల్ ఎస్టేట్ రంగం యొక్క కీలక డిమాండ్లను నేరుగా పరిష్కరించనప్పటికీ, వ‌చ్చే యూనియన్ బడ్జెట్ పరిశ్రమ ఆందోళనలను మరియు మార్కెట్ పోకడల్ని సమర్థవంతంగా ప్రభావితం చేసే మరిన్ని నిర్దిష్ట చర్యలను తీసుకోవ‌చ్చ‌ని రియ‌ల్ రంగం ఆశాభావం వ్య‌క్తం చేస్తోంది.

This website uses cookies.