హైదరాబాద్ నిర్మాణ రంగంలో సరికొత్త ట్రెండ్స్ నెలకొంటున్నాయి. కొందరు వెనకా ముందు చూడకుండా పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టి దారుణంగా మోసపోతున్నారు. ఇలాంటి వారంతా రియాల్టీలో పెట్టుబడి పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తల్ని తీసుకోవాలి?
హైదరాబాద్ నిర్మాణ రంగం డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. స్థిర నివాసం కోసం ఇళ్లను కొనేవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇన్వెస్ట్‌మెంట్ కోణంలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరిగింది. ఇలాంటి ఇన్వెస్టర్లు కొత్త ప్రాజెక్టులు, ప్రీలాంచ్ స్కీముల్లోనే ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని భావించడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, దురాశపరులైన కొందరు బయ్యర్లు గుర్తించాల్సిన వాస్తవం ఏమిటంటే.. సదరు బిల్డర్ నిర్మాణాన్ని ఆరంభిస్తేనే తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుంది. ఒకవేళ ఆ బిల్డర్ ప్రాజెక్టును ప్రారంభించకపోతే ఏమవుతుందో ఆలోచించాలి. అట్టి నిర్మాణానికి అనుమతి రాకపోతే పరిస్థితి ఏమిటి? ఆయా స్థలం నిషేధిత జాబితాలో ఉందనుకోండి.. లేదా కన్వర్షన్ చేసుకోవాల్సి వచ్చిందనుకోండి ఎంత ఇబ్బందో అర్థం చేసుకోవాలి. ఆయా ప్రాజెక్టు ఆరంభమే కాకపోతే మీ పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.
- హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు నెలకొన్నాయంటే.. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు చెందిన బిల్డర్లు సైతం.. హైదరాబాద్‌కు విచ్చేసి ప్రీలాంచ్ మరియు కమర్షియల్ ప్రాజెక్టల్ని ఆరంభించి.. స్థానిక ఇన్వెస్టర్లను దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేవారెవ్వరైనా.. కాస్త పేరున్న నిర్మాణ సంస్థ వద్ద రెరా ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అనుమతుల్లో కొంత జాప్యం జరిగినా.. ప్రాజెక్టును పక్కాగా డెలివరీ చేస్తారనే గ్యారెంటీ ఉంటుంది.
- మీరు ఒక ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టాలని భావించినప్పుడు, ఆయా సంస్థ బ్యాక్ గ్రౌండ్ పూర్తిగా తెలుసుకోండి
- గతంలో ఎన్ని ప్రాజెక్టుల్ని సకాలంలో అందించాడో గమనించాలి
- అపార్టుమెంట్లను హ్యాండోవర్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా బయ్యర్లకు అందజేశాడా? లేదా? అనే అంశాన్ని తెలుసుకోవాలి
- ఒక ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టేటప్పుడు.. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. అంతేతప్ప, పెట్టుబడి పెట్టిన ఆరు నెలలకో ఏడాదికో లాభాలు వస్తాయని ఆశించకూడదు.
- పది లక్షలు లేదా ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టండి.. ప్రతినెలా అద్దె అందుకోండంటూ కొందరు చేస్తున్న ఊకదంపుడు ప్రచారాన్ని ఎట్టి పరిస్థితిలో నమ్మకండి. మీరు కట్టే సొమ్ము నుంచి కొంతకాలం అద్దె చెల్లిస్తారు. ఆతర్వాత చేతులెత్తేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, అలాంటి స్కీముల జోలికి వెళ్లకపోవడమే బెటర్.