- పెళ్లి కాని జంటలకు మరీ సమస్య
- సోషల్ మీడియాలో ఓ జంట ఆవేదన
బెంగళూరు తర్వాత హైదరాబాద్‌లో అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకోవడం సవాలుగా మారిందా? భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ, పెళ్లి కాని జంటలకు ఫ్లాట్ దొరకడం కష్టమవుతుందా? అంటే ఔననే అంటోంది ఓ జంట. బెంగళూరు, హైదరాబాద్ నగరాలు దక్షిణ భారతదేశంలోని మొదటి మూడు రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఉండగా.. బెంగళూరు అద్దె మార్కెట్ వివిధ కారణాలరీత్యా అందరినీ ఆకర్షిస్తుంది. అధిక అద్దెలు, భారీ డిపాజిట్లు, ఇంటి యజమానులు పెట్టే షరతులు విచిత్రంగా అనిపిస్తాయి.
తాజాగా హైదరాబాద్ రెంటల్ హౌసింగ్ మార్కెట్ కూడా బెంగళూరుతో పోటీపడుతూ వేగంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా పెళ్లి కాని జంటలకు అద్దె ఇల్లు దొరకడం గగనమవుతోందని నెటిజన్లు పేర్కొంటున్నారు. తాము అద్దె ఇంటి కోసం రూ.50వేల బడ్జెట్ పెట్టుకున్నప్పటికీ ఇల్లు దొరకడంలేదని ఓ జంట తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘నేను, నా భాగస్వామి నెల రోజులుగా కొండాపూర్‌కు 10 కిలోమీటర్ల పరిధిలో ఇంటి కోసం చూస్తున్నాము.
మేము గేటెడ్ సొసైటీలో 2 బీహెచ్ కే కావాలనుకుంటున్నాం. రూ.50వేల బడ్జెట్ పెట్టుకున్నాం. అంత బడ్జెట్ ఉంది కాబట్టి ఇల్లు దొరకడం కష్టం కాదని అంతా అనుకుంటారు. కానీ మాకు ఇల్లు దొరకలేదు. మాకు నచ్చిన ప్రతి ఫ్లాట్ కు ఉన్న షరతులు మాకు ఇల్లు దొరకకుండా చేస్తున్నాయి. అందరూ వివాహిత జంటలు లేదా కుటుంబాలు, శాఖాహారులే కావాలంటున్నారు. మేం మతాంతర జంట కాబట్టి మాకు అద్దె ఇల్లు దొరకడం మరీ ఇబ్బందిగా ఉంది’ అని పేర్కొన్నారు. దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ.. నిజం చెప్పి బాధలు పడటడం కంటే పెళ్లి అయిపోయిందని అబద్ధం చెప్పమని, తాను మూడేళ్లు అలాగే చేశానని పేర్కొన్నాడు.