(రెజ్ న్యూస్, హైదరాబాద్)
కోకాపేట్.. హైదరాబాద్‌లో హాట్ లొకేషన్. దేశ, విదేశీ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాల్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. వందలాది ఎకరాల్లో ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఇక్కడే కొలువుదీరుతున్నాయి. కొన్ని వందలాది మంది ఉద్యోగులు ఇక్కడి ఐటీ సంస్థల్లో పని చేస్తున్నారు. రానున్న రోజుల్లో అనేక కంపెనీలు కోకాపేట్ ప్రాంతం నుంచి కార్యకలాపాల్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. ఈ కారణం వల్లే ఇటీవల కాలంలో హెచ్ఎండీఏ నిర్వహించిన వేలం పాటకు అపూర్వ ఆదరణ లభించింది. ఉన్న కొద్దిపాటి స్థలాన్ని కొనుగోలు చేయడానికి పలు సంస్థలు పోటీ పడ్డాయి. అయితే, ట్రిపుల్ వన్ జీవోను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కోకాపేట్ ప్రాంతానికి డిమాండ్ తగ్గుతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అసలు కోకాపేట్ కథ ఏంటి? ఎప్పట్నుంచి ప్రపంచానికి కోకాపేట్ గురించి తెలుసు? నిజంగానే కోకాపేట్ కథ ఖతం అయినట్లేనా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు , హైదరాబాద్ మెట్రో రైలు వంటివి ఆరంభమయ్యాయి. అప్పట్లో ప్రభుత్వం తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డు గచ్చిబౌలి నుంచి శంషాబాద్ విమానశ్రయానికి వేయాలన్నది ఒక ప్రతిపాదన. అదే సమయంలో గచ్చిబౌలి చుట్టుపక్కల అభివృద్ధికి చెందడానికి ఆస్కారమున్న ప్రాంతాలపై దృష్టి సారించి వాటిని వేలం వేస్తే జలయజ్ఞం కార్యక్రమానికి నిధులు సమకూరుతాయని అప్పటి ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో కోకాపేట్ భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందని అప్పటి హెచ్ఎండీఏ అధికారులు భావించి కోకాపేట్ లో ఉన్న ప్రభుత్వ భూముల్ని వేలం వేయాలని నిర్ణయించారు. 2006 జులైలో సుమారు 70 ఎకరాల స్థలాన్ని అప్పటి హుడా వేలం వేసింది. భారతదేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థలైన ప్రెస్టీజ్, టుడే, లేక్‌పాయింట్, పయోనీర్, ఐబీసీ నాలెడ్జి పార్క్, కైలాష్ గంగా, మైహోమ్ వంటి సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొని స్థలాన్ని చేజిక్కించుకున్నాయి. ఆ వేలంలో ఎకరానికి రూ.14.5 కోట్లు పలికింది. అప్పుడు ప్రభుత్వానికి సుమారు రూ.703 కోట్లు దాకా సమకూరాయి.
కాకపోతే, ఆ వేలం పాటల మీద నవాబ్ నసరత్ జంగ్ 1 వారసులం అంటూ కేఎస్‌బీ అలీ తదితరులు ఈ వేలం పాటను నిలిపివేయాలని, ఆ భూములు తమవని పేర్కొంటూ హైకోర్టు, ఆతర్వాత సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో, అప్పటి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వేలం వేసిన భూముల్లో కొన్నవారు ఒక్కసారి షాక్ తిన్నారు. ఫలితంగా, ప్రభుత్వం అప్రతిష్ఠను మూటగట్టుకున్నది. మొత్తానికి, ఆ తర్వాత అనేక మలుపులు తిరిగిన తర్వాత ఆ భూమి ప్రభుత్వానికే దక్కుతుందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత అక్కడి అభివృద్ధికి అడ్డే లేకుండా పోయింది. ఇక్కడ ప్రతిఒక్కరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. కోకాపేట్ అనేది రాత్రికి రాత్రే అభివృద్ధి చెందలేదు. ఈ ప్రాంతం సుమారు పదిహేనేళ్ల నుంచి ప్రజల నోట్లో నానుతున్నది. కోకాపేట్ ప్రత్యేకతను అంచనా వేసిన దేశీయ నిర్మాణ సంస్థల్లో అప్పట్లో ఎకరానికి రూ.14.5 కోట్లు పెట్టి కొన్నారు. పదిహేనేళ్ల క్రితం ఆరంభమైంది కోకాపేట్ గ్రోత్ స్టోరీ. ఇదేదో రాత్రికి రాత్రే డెవలప్ కాలేదు.
This website uses cookies.