ఐటీ నగరం బెంగళూరులో అద్దెల గురించి చెప్పక్కర్లేదు. అక్కడ జీవన వ్యయం భారీగా ఉండటానికి కారణాల్లో అద్దెలు ఒకటి. నెలనెలా చెల్లించాల్సిన అద్దె కంటే రెంటల్ డిపాజిట్ కింద ఏకంగా 10 నెలల మొత్తం చెల్లించాల్సి రావడమే అసలు సమస్య. ఈ అద్దె డిపాజిట్ భారం చాలా ఎక్కువగా పడేది. ఈ నేపథ్యంలో దీనికి చెక్ చెప్పేందుకు గత మూడేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా.. ఆశించిన మేర పురోగతి లేదు.
2024 జనవరి-మార్చి కాలంలో కూడా రెంటల్ డిపాజిట్లు భారీగానే పెరిగాయి. గత త్రైమాసికంతో పోలిస్తే.. ఇందులో ఏకంగా 20 శాతం పెరుగుదల నమోదైంది. తాజాగా బెంగళూరులో జీరో డిపాజిట్ రెంటల్ స్కీమ్ మరోసారి తెర పైకి వచ్చింది. వాస్తవానికి ఈ విధానాన్ని 2022 చివర్లో నో బ్రోకర్ డాట్ కామ్ ప్రవేశపెట్టింది. ఇది అధిక అద్దె కలిగిన 2, 3, 4 బీహెచ్ కే ప్రాపర్టీలకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో 2022తో పోలిస్తే 2023లో 400 శాతం మేర వృద్ధి సాధించింది. 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న ప్రొఫెషనల్స్ దీనిని ఎంచుకుంటున్నారు. ఈ స్కీమ్ లో ఏడాది అద్దె మొత్తంలో 6 శాతం చెల్లిస్తే చాలు. ఉదాహరణకు ఓ ఇంటి అద్దె నెలకు రూ.25వేలు అనుకుంటే..
పది నెలల మొత్తం అంటే.. రూ.2.50 లక్షలు అడ్వాన్స్ గా ఇవ్వాలి. అదే జీరో డిపాజిట్ రెంటల్ స్కీమ్ కింద రూ.15వేలు చెల్లిస్తే సరిపోతుంది. మరోవైపు మూడేళ్లుగా చర్చల్లో సాగుతున్నా.. కర్ణాటక మోడల్ టెనన్సీ చట్టంలో మార్పులు చేర్పులు ఇంకా కొలిక్కి రాలేదు. ఇది అమల్లోకి వస్తే ఇంటి యజమాని అద్దెదారు నుంచి రెండు నెలల అద్దె మాత్రమే డిపాజిట్ కింద తీసుకోవాల్సి ఉంటుంది.
ఢిల్లీలో రెండు నుంచి మూడు నెలల అద్దె మాత్రమే అడ్వాన్స్ గా తీసుకుంటారని.. బెంగళూరులో మాత్రం 6 నెలల నుంచి 10 నెలల అడ్వాన్స్ అడుగుతున్నారని.. ఈ నేపథ్యంలో జీరో రెంటల్ డిపాజిట్ వస్తే చాలామంది ఐటీ నిపుణులకు ఉపయోగకరంగా ఉంటుందని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పేర్కొన్నారు. అందుబాటు అద్దె, తక్కువ డిపాజిట్ తో కూడిన ఇల్లు అద్దెకు దొరకడం సవాల్ తో కూడుకున్న విషయమని మరో ఐటీ ఉద్యోగి పేర్కొన్నారు. తక్కువ అద్దె డిపాజిట్, జీరో రెంటల్ డిపాజిట్ అనేది బెంగళూరులో వర్కవుట్ కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
చాలామంది ఆ అద్దె డిపాజిట్ ను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకుని 3 నుంచి 6 శాతం వడ్డీ పొందుతున్నారని తెలిపారు. మరోవైపు ఇంటి యజమానుల వాదన మరోలా ఉంది. ఒకవేళ తమ ప్రాపర్టీకి ఏదైనా డ్యామేజీ జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని.. అలాంటి సందర్భంలో తాము నష్టపోకుండా ఉండటానికే ఎక్కువ మొత్తం డిపాజిట్ గా తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.
This website uses cookies.