- నిజామాబాద్ లో సిండికేట్ గా మారిన రియల్టర్లు
- భూములు, ఇళ్ల ధరలు అమాంతం పెంచేసిన వైనం
సామాన్యుడి సొంతింటి కల తీరడం అంతకంతకూ గగనమైపోతోంది. హైదరాబాద్ లోనే కాదు.. జిల్లా కేంద్రాల్లో కూడా రియల్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. తెలంగాణలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న నిజామాబాద్ లో రియల్టర్లు సిండికేట్ గా మారడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. 15 ఏళ్ల క్రితం నిజామాబాద్ కార్పొరేషన్ గా మారడంతో రియల్ రంగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో రియల్టర్లు ఏకమై అమాంతంగా భూములు, ఇళ్ల ధరలు పెంచేశారు. ఇక్కడ ఓ విల్లా ఖరీదు రూ.కోటిన్నర నుంచి రూ.3 కోట్ల వరకు ఉన్నాయంటే పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాల కల్చర్ పెరగడంతో రియల్ వ్యాపారులు ఏకమై సామాన్యులకు సొంతింటి కల అందనివ్వడంలేదు. విస్తీర్ణపరంగా నిజామాబాద్ చిన్నగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో కొత్తగా భూములు దొరకని పరిస్థితి ఉంది. ఒకవేళ ఎక్కడైనా దొరికినా కోట్లలో చెల్లించక తప్పదు. పైగా రియల్టర్లు అంతా ఏకం కావడంతో నగరంలోని కొన్ని ప్రాంతాలనే ఎంపిక చేసుకుని భూములు ధరలు పెంచేశారు. నిజామాబాద్ శివార్లలోనే గజం భూమి ధర రూ.25వేల పైమాటే. వాస్తవానికి నిజామాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ కు అనుకూలమైన భూములు చాలా ఉన్నప్పటికీ, రియల్టర్లు సిండికేట్ గా మారడంతో కొన్ని ప్రాంతాలనే ఎంపిక చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. దీంతో వారు నిర్ణయించిందే ధరగా మారుతోంది. తద్వారా సామాన్యుల సొంతింటి కల దూరమవుతోంది.