* కొంపల్లిలో కొత్తగా ఐటీ ట్విన్ టవర్లు
* 8న జరిగేది కేవలం భూమి పూజే
* 19 ఎకరాల్లో.. 5 లక్షల చ.అ. బిల్టప్ ఏరియా
* రాత్రికి రాత్రే అద్భుతమేమీ జరగదు
* నిర్మాణం పూర్తయ్యేందుకు 3-4 ఏళ్లు
* కంపెనీలు వచ్చేందుకు 1-2 ఏళ్లు
* ఇప్పటికే భూముల ధరలు ఆకాశానికి
* ఒకటికి రెండుసార్లు ఆలోచించండి
* ఆతర్వాతే ప్లాట్లు, ఫ్లాట్లు కొనండి
కొంపల్లిలో ఐటీ టవర్లు వస్తున్నాయనే ఉద్దేశ్యంతో కొందరు రేట్లు ఎక్కువ పెంచి భూములు, ఫ్లాట్లు, ఫ్లాట్లు అమ్మేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి మాటల్ని ఎట్టి పరిస్థితిలో నమ్మకండి. ప్రస్తుతం జరిగేది కేవలం ఐటీ టవర్ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ మాత్రమే. ప్రభుత్వం నిర్మాణపనులకు పక్కాగా బడ్జెట్ కేటాయించి.. నిర్మాణమంతా పూర్తవ్వడానికి ఎంతలేదన్నా రెండు, మూడేళ్లు పడుతుంది. ఆతర్వాత అందులో కంపెనీలు స్థలాన్ని తీసుకుని కార్యకలాపాల్ని ఆరంభించేందుకు ఎంతలేదన్నా మరో ఏడాది పడుతుంది. కాకపోతే, ఈ ప్రక్రియ మొత్తం తెలియక.. చాలామంది ఏజెంట్లు అత్యుత్సాహంతో ఏం చేస్తారంటే.. ఐదేళ్ల తర్వాత పెంచాల్సిన రేట్లను ఇప్పుడే పెంచేసి విక్రయించేందుకు విపరీతంగా ప్రయత్నిస్తారు. కాబట్టి, అలాంటి మోసపూరిత వ్యక్తుల మాటల్ని నమ్మకండి. ఎక్కువ రేటు పెట్టి ఎట్టి పరిస్థితిలో ప్లాట్లు కొనకండి. గత రెండు, మూడేళ్ల నుంచి రేట్లు పెరిగిపోయాయి. ఐటీ టవర్లు వస్తున్నాయని చెబుతూ మరికొంత రేటు పెంచేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి, వాస్తవిక పరిస్థితుల్ని అంచనా వేశాకే తుది నిర్ణయం తీసుకోండి.
* మాదాపూర్లో సైబర్ టవర్స్ భూమి పూజ జరిగి నిర్మాణం పూర్తయ్యేందుకు నాలుగేళ్లు పట్టింది. ఆతర్వాత అక్కడ కొత్త కార్యాలయాలు ఏర్పడిన మూడేళ్ల తర్వాత కానీ చుట్టుపక్కల ప్లాట్లు, ఫ్లాట్ల ధరలు పెరగలేదు. ఈ విషయం తెలియక చాలామందికి రియల్టర్లు ట్విన్ టవర్ల వల్ల రాత్రికి రాత్రే అద్భుతం జరుగుతుందని అరచేతిలో స్వర్గం చూపించే అవకాశముంది. కాబట్టి, వాటిని ఎట్టి పరిస్థితిలో నమ్మకండి. ట్విన్ టవర్లు ఏర్పాటు కాగానే.. కొంపల్లి ఏరియాలో మొత్తం కొరియా తరహాలో తయారవుతుందని.. పాశ్చాత్య సంస్థలన్నీ కొంపల్లికి పరుగులు పెడతాయని అపోహపడకండి. ట్విన్ టవర్లను అడ్డం పెట్టుకుని చాలామంది రియల్టర్లు, ఏజెంట్లు.. ప్లాట్లు, ఫ్లాట్ల ధరల్ని పెంచేందుకు ప్రయత్నిస్తారు. వారి మాయలో పడకండి. వాస్తవికంగా ఆలోచించాకే రేటు గురించి ఆలోచించి నిర్ణయించుకోండి.