హైదరాబాద్ మహా నగరానికి రీజినల్ రింగ్ రోడ్డు మరో మణిహారం కానున్నది. మొత్తం 347 కిలో మీటర్ల పొడవున 4 వరుసలతో నిర్మించే ఈ గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వేను రెండు భాగాలుగా నిర్మించనున్నారు. రెండు నుంచి మూడేళ్లలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా జగదేవ్ పూర్ దగ్గర నిర్మించే భారీ జంక్షన్ తో అక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఫ్యూచర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం జరుపుకోబోయే ఈ భారీ ఇంటర్ చేంజర్స్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ కు మంచి అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్స్ లో జగదేవ్ పూర్ సమీపంలో వచ్చే జంక్షన్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. జగదేవ్ పూర్ దగ్గర నిర్మించబోయే ఇంటర్ చేంజర్ చుట్టు పక్కల భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే భువనగిరి నుంచి గజ్వేల్ వరకు డెవలప్ అవ్వగా.. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు, జగదేవ్ పూర్ దగ్గర వచ్చే భారీ జంక్షన్ తో ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందనుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే రీజినల్ రింగ్ రోడ్డు కు సంబంధించి జగదేవ్ పూర్ సమీపంలో మార్కింగ్ చేయగా.. అందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తైంది. ఈ క్రమంలో జగదేవ్ పూర్ చుట్టుపక్కల ప్రాంతాలు భవిష్యత్తులో ఊహించలేనంతగా మారిపోతుందని రియాల్టీ వర్గాలు అంటున్నాయి. ట్రిపుల్ ఆర్ మార్కింగ్ తో జగదేవ్ పూర్ సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంతమేర ఊపందుకుంది. భువనగిరి గజ్వేల్ మధ్య మొన్నటి వరకు హైవే ఫెసింగ్ తో ఎకరం కోటి రూపాయల నుంచి 1.2 కోట్ల రూపాయలు ఉండగా.. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు జంక్షన్ ఏర్పాటు కానుండటంతో ఇక్కడ ఎకరం 1.4 కోట్ల నుంచి 1.6 కోట్లకు పెరిగిందని చెబుతున్నారు. రహదారి నుంచి కాస్త లోపలికి 2 నుంచి 5 కిలోమీటర్ల రేడియస్లో ఎకరం 80 లక్షల నుంచి కోటి రూపాయల మేర ధరలున్నాయి.
ట్రిపుల్ ఆర్ జంక్షన్ ఏర్పాటయ్యే జగదేవ్ పూర్ సమీపంలోని రుస్తాపూర్, తుర్కపల్లి, వాసాలమర్రి, ఎర్రవల్లి వరకు ఇప్పటికే రియల్ వెంచర్లు వెలిశాయి. ఇక రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్ ఏర్పాటవుతుండటంతో భారీగా వెంచర్లు వేసేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం వాసాలమర్రిలో డీటీసీపీ లేఅవుట్ లో రియాల్టీ ప్రాజెక్టు, ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 12 వేల నుంచి 24 వేల వరకు ధరలున్నాయి. ఇక జగదేవ్ పూర్ సమీప పరిసర ప్రాంతాల్లో చదరపు గజం 14 వేల నుంచి 28 వేల వరకు ప్లాట్ల ధరలున్నాయి. జగదేవ్ పూర్ సమీపంలోని ఎర్రవల్లిలో భారీ స్థాయిలో ఇప్పటికే ఓపెన్ ప్లాటు వెంచర్లు ఉండగా.. చదరపు గజం 14 వేల నుంచి మొదలు 24 వేల వరకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ తరువాత దామరకుంటలో డీటీసీపీ లేఆవుట్లలో చదరపు గజం 10 వేల నుంచి 15 వేల వరకు ధరలున్నాయి.
This website uses cookies.