Categories: TOP STORIES

ప్రీలాంచులతో జయా గ్రూప్ రూ. 300 కోట్ల మోసం!

హైద‌రాబాద్‌లో మ‌రో ప్రీలాంచ్ స్కామ్ వెలుగులోకి వ‌చ్చింది. కేపీహెచ్‌బీ కాల‌నీ కేంద్రంగా ప‌ని చేస్తున్న జ‌య గ్రూప్ ఇంట‌ర్నేష‌న‌ల్ అనే సంస్థ ప్రీలాంచుల పేరిట అమాయ‌కుల కుచ్చుటోపి పెట్టింది. దీనిపై బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో.. సంస్థ ఎండీ కాక‌ర్ల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వాస్త‌వానికి, ఈ సంస్థ అక్ర‌మంగా చేస్తున్న ప్రీలాంచ్ దందాపై గ‌తేడాది డిసెంబ‌రు 10న రెజ్ న్యూస్ ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. హైద‌రాబాద్‌లో ఎన్ని సాహితీలున్నాయ‌ని ప్ర‌చురించిన క‌థ‌నంలో జ‌య‌గ్రూప్ వ్య‌వ‌హారాల‌ను ప్ర‌స్తావించింది. స‌రిగ్గా న‌ల‌భై ఐదు రోజుల త‌ర్వాత‌.. రెజ్ న్యూస్ చెప్పిందే నిజమైంది. ఈ మోసం విలువ ఎంత‌లేద‌న్నా మూడు వందల కోట్ల దాకా ఉంటుంద‌ని ప్రాథ‌మిక అంచ‌నా.

జ‌య‌గ్రూప్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రీలాంచులో ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తోంద‌ని.. రేపో మాపో బిచాణా ఎత్తేసినా ఆశ్చర్య‌పోన‌క్క‌ర్లేద‌ని వెల్ల‌డించింది. అయినా రెరా అథారిటీ ఎప్ప‌టిలాగే పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అప్పుడేమో పోలీసులు లైట్ తీసుకున్నారు. నెలాప‌దిహేను రోజులు గ‌డిచాయో లేదో.. జ‌య గ్రూప్ సంస్థ ఎండీ కాక‌ర్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేశామ‌ని కేపీహెచ్‌బీ కాల‌నీ పోలీసులు అధికారికంగా వెల్ల‌డించారు. తొలుత మోసం విలువ రూ.20 కోట్ల దాకా ఉంటుంద‌ని పోలీసులు చెబుతున్న‌ప్ప‌టికీ.. అంత‌కంటే ఇంకా ఎక్కువే వ‌సూలు చేశాడ‌ని స‌మాచారం.

శంక‌ర్‌ప‌ల్లి, చేవేళ్ల‌, ప్ర‌జ్ఞాపూర్‌, స‌దాశివ‌పేట్‌, షాద్ న‌గ‌ర్, షాబాద్, మహేశ్వరం, కందుకూరు వంటి ప్రాంతాల్లో ప్లాట్లు.. కొంపల్లి, కేపీహెచ్బీ కాలనీ, ప్రగతి నగర్, చందాన‌గ‌ర్‌, ముత్తంగి, నిజాంపేట్‌, రాయ‌దుర్గం, లింగంప‌ల్లి, స‌ర్దార్ ప‌టేల్ న‌గ‌ర్‌లో ఫ్లాట్ల‌ను ప్రీలాంచ్ పేరుతో జ‌య ఇంట‌ర్నేష‌న‌ల్ గ్రూప్ విక్ర‌యించింది. చ‌ద‌ర‌పు అడుక్కీ మూడు వేల‌కు అటుఇటుగా ఫ్లాట్ల‌ను నిర్మిస్తామంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం నిర్వ‌హించింది. ఇది నిజ‌మేన‌ని న‌మ్మి ఏకంగా ప్ర‌వాసులు ఇందులో పెట్టుబ‌డి పెట్టారు. కొంద‌రైతే కోటీ నుంచి ప‌ది కోట్ల దాకా పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు స‌మాచారం.
వాణిజ్య స‌ముదాయాలు, కేపీహెచ్‌బీ కాల‌నీ మెట్రో స్టేష‌న్‌లో స్టాళ్ల పేరిట ప్ర‌జ‌ల నుంచి సొమ్ము వ‌సూలు చేశాడు. వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడి పెడితే.. ప్రతినెలా వడ్డీ చెల్లిస్తామంటూ సొమ్ము వసూలు చేశాడని సమాచారం. ఇలా, మొత్తానికి ఓ రూ.300 కోట్ల‌ను ఈ సంస్థ ఎండీ ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేసి బోర్డు తిప్పేశాడ‌ని స‌మాచారం. దీంతో ల‌బోదిబోమ‌న్న బాధితులు కేపీహెచ్‌బీ కాల‌నీ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. గ‌త కొంత‌కాలం నుంచి త‌ప్పించుకు తిరుగుతున్న కాక‌ర్ల శ్రీనివాస్‌ను ఎట్ట‌కేల‌కు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతని సోదరుడు, ఇతర డైరెక్టర్ల కోసం గాలిస్తున్నారు. ఈ సంస్థ ఎండీ మోసాల‌కు పాల్ప‌డ‌ట్లు ఆధారాలున్నాయ‌ని కూక‌ట్‌ప‌ల్లి ఏసీపీ ప‌త్రికా స‌మావేశంలో వెల్ల‌డించారు. పోలీసులు త‌మ‌కు న్యాయం చేయాల‌ని బాధితులు కోరుతున్నారు.

 

ఇంత త‌క్కువంటే ఎలా నమ్మారు?

కొత్తూరులో రూ.60 లక్షలకే విల్లా.. 40 లక్షలకే ఇల్లు.. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్.. చందానగర్లో రూ.35 లక్షలు.. ప్రగతినగర్లో రూ.35 లక్షలే.. ముత్తంగిలో రూ.27 లక్షలు.. అతి త‌క్కువ‌కే ప్లాట్లు.. అంటూ జ‌య‌గ్రూప్ ప్ర‌చారం చేయ‌డంతో కొంద‌రు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు అత్యాశ‌ప‌డ్డారు. ఫ్లాట్ క‌డ‌తాడా? లేడా? అనే అంశాన్ని ప‌ట్టించుకోకుండా.. వంద శాతం సొమ్మును అత‌ని ఖాతాలో వేశారు. రేటు త‌క్కువంటే పెట్టుబ‌డి పెట్టిన‌వారిలో ప్ర‌వాసులూ ఉన్నారంటే న‌మ్మండి. అస‌లు అపార్టుమెంట్ నిర్మాణానికి ఖ‌ర్చు ఎంత అవుతుందో తెలియ‌కుండా.. అమాయ‌క ప్ర‌జ‌ల్నుంచి కోట్ల రూపాయ‌ల్ని వ‌సూలు చేసిన జ‌య‌గ్రూప్ ఇంట‌ర్నేష‌నల్ సంస్థ ఎండీ కాక‌ర్ల శ్రీనివాస్ రావు కేపీహెచ్‌బీ కాల‌నీలో బోర్డు తిప్పేశాడు.

ఇప్ప‌టికైనా ఇలా క‌ట్ట‌డి చేయాలి!

రాష్ట్ర ప్ర‌భుత్వం ముంద‌స్తుగా ఆలోచించి.. సాహితీ వంటి స్కామ‌ర్లు మార్కెట్లో ఎంత‌మంది ఉన్నారో ఆరా తీయాలి. వారి వివ‌రాల్ని తెలంగాణ రెరా అథారిటీ పూర్తిగా సేక‌రించాలి.

  • కొనుగోలుదారులు ఏయే సంస్థ‌ల వద్ద ప్రీలాంచుల్లో ఫ్లాట్లు కొన్నారో.. వారి స‌మాచారాన్ని అంద‌జేయాల‌ని రెరా అథారిటీ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేయాలి. ఫ‌లితంగా, ఈ ప్రీలాంచుల్లో ఫ్లాట్లు అమ్మిన వారికి కొంత భ‌యం ఏర్ప‌డుతుంది.
  • ప్రీలాంచ్ సంస్థ‌ల‌కు నోటీసులిచ్చి.. ప్రాజెక్టుల పురోగ‌తి గురించి తెలుసుకోవాలి. ఆయా ప్రాజెక్టుల త‌మ ప‌రిధిలోకి రావు క‌దా అని భావించ‌కుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్ని తీసుకోవాలి.
  • ప్రీలాంచుల్లో అమ్మిన డెవ‌ల‌ప‌ర్ల‌తో క‌లిపి రెరా అథారిటీ ఒక డేటా బేస్ త‌యారు చేయాలి.
  • ఇక నుంచి రాష్ట్రంలో ప్రీలాంచుల్లో ఫ్లాట్లు అమ్మ‌కూడ‌ద‌ని పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న‌ల్ని విడుద‌ల చేయాలి.
  • ప్ర‌భుత్వం ముంద‌స్తుగా ఆలోచించి క‌ట్టుదిట్ట చ‌ర్య‌ల్ని తీసుకుంటే త‌ప్ప‌.. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని స్కాముల్లో ప్ర‌జ‌లు సొమ్ము పెట్ట‌కుండా ఉంటారు.
  • మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకాన్ని దృష్టిలో పెట్టుకుని.. ప్ర‌భుత్వం అందుబాటు ధ‌ర‌లో ఇళ్ల‌ను నిర్మించే ప్ర‌య‌త్నాల‌ను మొద‌లెట్టాలి. లేక‌పోతే, త‌లాతోక లేని బిల్డ‌ర్లు త‌క్కువ రేటుకే ఫ్లాటు అని ప్ర‌క‌ట‌న‌ల్ని గుప్పిస్తే.. అమాయ‌క కొనుగోలుదారులు అందులో సొమ్ము పెట్టి మోస‌పోయే ప్ర‌మాద‌ముంది.
  • ప్ర‌భుత్వం బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించి.. పూర్తి స్థాయి రెరా అథారిటీతో పాటు అప్పీలేట్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయాలి. దేశవ్యాప్తంగా రెరా చట్టం 2016లో అమల్లోకి వచ్చినప్పటికీ మన రాష్ట్రంలో 2018లో ప్రారంభించారు. అప్పట్నుంచి ఈ అథారిటీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను నమోదు చేస్తుందే తప్ప.. ఈ రంగంలో ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం చూపెట్టడం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

This website uses cookies.