భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నమూనా అద్దె చట్టం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని ఇంటి యజమానులు, కిరాయిదారులకు కలిగే ప్రయోజనమేమిటి? కేంద్రం ప్రతిపాదించిన చట్టాన్ని.. మన రాష్ట్రాల్లో వర్తింపజేయడం కంటే ముందు ఏయే అంశాలపై ఈ చట్టం ప్రజలకు మరింతగా ఉపయోగపడాలంటే.. ఏయే అంశాల్లో మార్పులు, చేర్పులు చేయాలి?
అద్దె ఇళ్లను నియంత్రించడంతో పాటు నిర్వహణ విషయంలోనూ స్పష్టమైన నిబంధనల్ని పొందుపరిచారు. దీంతో పూర్తి స్థాయి పారదర్శకత ఏర్పడుతుంది. ఇప్పటివరకూ ఎలాంటి చట్టం లేని క్రమంలో కొత్తగా ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం సరైన నిర్ణయమే. కాకపోతే, రెరా అథారిటీ తరహాలో మరో కొత్త విభాగం ఏర్పాటవుతుంది. ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తారు. కాకపోతే, ఈ చట్టం తెలుగు రాష్ట్రాలు మెరుగ్గా అమలయ్యేందుకు పలు మార్పులు చేయాల్సిన అవసరముంది.
స్టాంప్ డ్యూటీలో స్పష్టత
ప్రతి రెంటల్ అగ్రిమెంట్ ను రిజిస్టర్ చేసుకోవాలనే నిబంధనను విధించారు. ఈ ఒప్పందాలపై చెల్లించే సొమ్ము నామమాత్రంగా ఉండేలా చర్యలు చూసుకోవాలి. నివాస, వాణజ్య ఇళ్ల నెలసరి అద్దె విలువ మీద కాకుండా.. నామమాత్రపు సొమ్ము లేకపోతే స్థిరంగా కొంత తక్కువ మొత్తాన్ని నిర్ణయించాలి.
- ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖ ఏడాదిలోపు చేసే లీజ్ డీడ్ల మీద అద్దె మీద 0.4 శాతం స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తోంది.
- ఏడాది నుంచి ఐదేళ్లలోపు నివాస భవనాలపై వార్షిక అద్దె మీద 0.5 శాతం, ఇతర వాటి మీద ఒక శాతం నిర్ణయించింది.
- ఐదు నుంచి పదేళ్ల పాటు నివాస సముదాయాల లీజు మీద వార్షిక అద్దె ఒక శాతం తీసుకుంటోంది. ఇతర నిర్మాణాలైతే రెండు శాతం వసూలు చేస్తోంది.
- అయితే, ప్రస్తుతం కొత్త చట్టం వల్ల గతంలోకంటే ఎక్కువ అద్దె ఇళ్లు రిజిస్టర్ అయ్యే అవకాశముంది. ఈ చట్టం అమల్లోకి తెచ్చిన తొలి రోజుల్లో.. స్థిరంగా కొంత సొమ్మును వసూలు చేయాలి. అప్పుడే అద్దె ఒప్పందాల్ని ప్రజలు రిజిస్టర్ చేసుకుంటారు.
ఇప్పటికే రిజిస్టర్ అయితే?
నమూనా చట్టం రాక ముందు.. అంటే ఇప్పటికే మన రాష్ట్రంలో చాలామంది యజమానులు అద్దెదారులతో ఒప్పందం కుదుర్చుకుని ఉంటారు. డిపాజిట్ కూడా ఎక్కువే తీసుకుని ఉంటారు. లీజ్ డీడ్లు రాసుకుని ఉంటారు. వీటిలో కొన్ని రిజిస్టర్ అయ్యి ఉంటాయి. మరి తాజా చట్టం నేపథ్యంలో, ఈ ఒప్పందాల పరిస్థితి ఏమిటి? దీనిపై తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టత ఇవ్వాలి. ఇప్పటికే రిజిస్టర్ అయినవారి నుంచి ఎలాంటి రుసుములు తీసుకోకూడదు. రిజిస్టర్ కానివారి నుంచి నామమాత్రపు రుసుముకే రిజిస్టర్ చేసుకునే వీలును కల్పించాలి. సెమీఫినిష్డ్ మరియు ఫుల్లీ ఫర్నీచర్ గల ఇళ్లను బట్టి అద్దె డిపాజిట్లను నిర్ణయిస్తే మంచిది.
మన రాష్ట్రాలు మార్పులు చేయాలి
నమూనా అద్దె చట్టం అమల్లోకి వస్తే పారదర్శకత నెలకొంటుంది. ఇంటి యజమాని, అద్దెదారుడికి స్పష్టత ఏర్పడుతుంది. ఫలితంగా, వివాదాలు తలెత్తడానికి ఆస్కారం ఉండదు. కొన్ని సందర్భాల్లో తలెత్తినా వాటికి పరిష్కారం లభిస్తుంది. కాకపోతే, కేంద్ర రూపొందించిన చట్టాన్ని తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసే కంటే ముందు.. మన వద్ద నెలకొన్న వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేస్తే ఉత్తమం. అప్పుడే, అధిక శాతం మంది ఈ చట్టం పరిధిలోకి వస్తారు. ఫీజుల విషయంలో ఆలోచించాలి. ఇదివరకే రిజిస్టర్ అయిన ఒప్పందాల మీద స్పష్టతనివ్వాలి. ఇందుకు రుసుమును నామమాత్రంగా తీసుకోవాలి. ఈ కొత్త చట్టం అమలు విధానంలో ప్రభుత్వాలు స్పష్టతనివ్వాలి. లీజ్ డీడ్ల మీద ఎక్కువ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండటం వల్ల చాలామంది రిజిస్టర్ చేసుకోవడం లేదు. కాబట్టి, ఇప్పటికైనా రుసుములు తగ్గించాలి.
ఇరువురికి ప్రయోజనం
వివాదాల పరిష్కారానికి తీర్పు యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. దీంతో యజమాని మరియు అద్దెదారు ప్రయోజనాల్ని కాపాడవచ్చు. అప్పీళ్లను వినడానికి అద్దె కోర్టు మరియు అద్దె ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న విరుద్ధమైన పరిస్థితిని ఈ చట్టం మారుస్తుంది. రాష్ట్రాలు సుముఖత చూపిస్తే మోడల్ చట్టంలో ప్రకటించిన నిబంధనలు ఇరువురికి ఉపయోగకరంగా మారుతుంది.