* మారటోరియం పై పీఎం మోడీకి లేఖ రాసిన టీబీఎఫ్
* కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంకు విజ్ఞప్తి
కరోనా సెకండ్ వేవ్ క్రమక్రమంగా నిర్మాణ రంగాన్ని దారుణంగా దెబ్బ తీస్తోంది. కొత్త అమ్మకాల్లేవు. పాత కొనుగోలుదారుల్నుంచి చెల్లింపులు తగ్గాయి. మరెలా, నిర్మాణ రంగం నిలబడాలంటే ఏం చేయాలి?
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కొనుగోలుదారులు బయటికి రావడం లేదు. అమ్మకాల్లేకపోవడంతో ఎవరికీ చెల్లింపులు చేయలేని దుస్థితి. కొన్ని ప్రాజెక్టుల్లో నిర్మాణ పనులూ మందగించాయి. ఆర్థిక సంస్థల నుంచి తీసుకుని రుణాలపై నెలసరి వడ్డీలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్లో పెరిగిన ఆస్తుల విలువ నేపథ్యంలో.. అధిక శాతం నిర్మాణ సంస్థలు ఎక్కువ సొమ్ము వెచ్చించి బ్యాంకు రుణాలు తీసుకున్నాయి. వీటి వద్ద ఇల్లు కొన్నవారిలో అధిక శాతం మంది నెలసరి వాయిదాల్ని చెల్లించడం లేదు. పైగా, కొందరు ఇల్లు కొన్నప్పటికీ, కరోనా వల్ల వారికి బ్యాంకులు రుణాల్ని మంజూరు చేయడం లేదు. నిర్మాణ సంస్థలకు మంజూరైన రుణాల్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు విడుదల చేయడం లేదు.
మరోవైపు, కొత్త రుణాలకు సంబంధించిన దరఖాస్తులూ పెండింగులోనే ఉన్నాయి. మరోవైపు, నిర్మాణ సామగ్రిని విక్రయించే సంస్థలకు, కంట్రాక్టర్లకు సొమ్ము చెల్లించకపోతే పనులు నిలిచిపోయే ప్రమాదముంది. పెరిగిన స్టీలు, సిమెంటు, కార్మికుల కొరత, నిలిచిపోయిన పనులు వంటి కారణాల వల్ల డెవలపర్లు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారు. కాబట్టి, ఇప్పటికే తీసుకున్న రుణాలపై నెలసరి వడ్డీలను చెల్లించలేకపోతున్నారు. ఫలితంగా, వాటిపై వడ్డీల భారం పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం ముందుకు రావాలని టీబీఎఫ్ అధ్యక్షుడు ప్రభాకర్ రావు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
ప్రాజెక్టు రుణాలు, వ్యక్తిగత గృహాలు తీసుకున్న వారికి కనీసం ఆరు నెలల మారటోరియం విధించాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాను విజ్ఞప్తి చేశారు. నిర్మాణ రంగంతో పాటు కొనుగోలుదారులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని టీబీఎఫ్ విన్నవించింది. మరి, రానున్న రోజుల్లో మారటోరియం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
సైటులోనే టీకా
తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్లో దాదాపు ఎనిమిది వందల మంది బిల్డర్లు సభ్యులుగా ఉన్నారు. వీరంతా హైదరాబాద్కి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో నిర్మాణాల్ని చేపడుతున్నారు. వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు, నైపుణ్యం గల నిపుణులు, ఇంజినీర్లు, సూపర్ వైజర్లు పని చేస్తుంటారు. వీరిలో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి విచ్చేస్తారు. అయితే, సెకండ్ వేవ్ వల్ల అధిక శాతం మంది ఇక్కడే ఉండి పని చేసుకోవాలని భావిస్తున్నారు. కాకపోతే, వారికి టీకాలు వేయిస్తే.. ధైర్యంగా పని చేసుకోగల్గుతారు. కాబట్టి, వీరికి సైటులోనే టీకాలు వేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేయాలని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావులకు విన్నవించింది. మరి, దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని టీబీఎఫ్ వ్యక్తం చేసింది.