-
కొల్లూరులో ప్రీలాంచ్ స్కెచ్
-
40 ఫ్లోర్లు.. చ.అ.కీ. నాలుగు వేలే!
-
కట్టే ఉద్దేశ్యముందా? లేదా?
-
సొమ్ము తీసుకుని ఉడాయిస్తారా?
-
రెరా ఇప్పటికైనా కళ్లు తెరవాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ప్రీలాంచ్ మాయగాళ్ల పర్వానికి అడ్డుకట్ట పడలేదు. ఇందుకు చక్కటి ఉదాహరణ.. కొల్లూరులోని కాస్మోపోలిస్ ప్రాజెక్టు. ఈ మహారాజ్ ఎవరో పది ఎకరాల్లో జి ప్లస్ 39 అంతస్తుల ఎత్తులో కడతాడట. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్ని సంస్థ సిబ్బంది పంపిస్తూ.. పెట్టుబడిదారుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి తమ ప్రాజెక్టుకు విచ్చేస్తే.. మీరు కొనకుండా ఉండలేరంటూ బయ్యర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంత బడా గేటెడ్ కమ్యూనిటీలో చదరపు అడుక్కీ నాలుగు వేలేనంటూ అమాయకుల్ని బుట్టలో వేసుకుంటున్నారు. నలభై అంతస్తుల టవర్‌ను కట్టడానికే చదరపు అడుక్కీ నాలుగు వేలు అవుతుంది కదా.. అలాంటప్పుడు, ఈ కాస్మొపోలిస్ మహారాజ్ ప్రాజెక్టును ఎలా నిర్మిస్తాడు? ఎప్పుడు పూర్తి చేస్తాడు? అని కొందరు బయ్యర్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
కొల్లూరులో మహరాజా కాస్మోపోలిస్ అనే ప్రాజెక్టును పదెకరాల్లో.. ఐదు టవర్లను నిర్మిస్తున్నామంటూ.. రెరా అనుమతి లేకుండా.. ప్రీలాంచ్ స్కామ్‌కు తెరలేపింది. అసలీ ప్రాజెక్టును కడుతున్న బిల్డర్ ఎవరు? ఆయన గతంలో ఎన్ని ప్రాజెక్టుల్ని పూర్తి చేశాడు? సకాలంలో కొనుగోలుదారులకు అప్పగించాడనే విషయాన్ని టీఎస్ రెరా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే, ఇలాంటి ప్రీలాంచ్ సంస్థలు మార్కెట్లో కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటాయి. అసలీ కంపెనీకి నిర్మాణాల్ని పూర్తి చేసే నైపుణ్యముందా? లేక ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను కొనేందుకు బయ్యర్లు ముందుకొస్తున్నారని ప్రాజెక్టును ఆరంభించిందా? అనే విషయాన్ని టీఎస్ రెరా పరిశోధన చేయాలి. ఎందుకంటే, ఇలాంటి ప్రాజెక్టులు ఆరంభమైన తొలి రోజుల్లోనే రెరా స్పందించి తగిన చర్యల్ని తీసుకోవాలి. ఆయా నిర్మాణాలను పూర్తిగా నియంత్రించాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా టీఎస్ రెరా వ్యవహరిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు.
ప్రీలాంచా? ఇవి తెలుసుకోండి!
ఎవరైనా ప్రీలాంచ్‌లో ఫ్లాట్లు అమ్ముతుంటే.. ఆయా సంస్థ గతంలో ఎక్కడైనా ప్రాజెక్టును నిర్మించిందా? లేదా? అనే విషయాన్ని పక్కాగా కనుక్కోండి. ఒకవేళ, ఆయా బిల్డర్ కట్టాడని చెబితే.. ఎన్ని నిర్మించారు? ఎక్కడెక్కడ కట్టారో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. చాలామంది బిల్డర్లు సకాలంలో నిర్మాణ పనుల్ని ఆరంభిస్తారు కానీ, పూర్తి చేసేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. కాబట్టి, మీ బిల్డర్ ప్రాజెక్టును ఆరంభించాక, ఎప్పటిలోపు పూర్తి చేశాడనే విషయాన్ని తెలుసుకోండి. ఇందుకోసం వీలైతే ఆయా ప్రాజెక్టుల్ని సరదగా సందర్శించండి. వీలైతే అందులో ఉంటున్న వారితో మాట్లాడి వారి అనుభవాల్ని తెలుసుకోండి. కొంతమంది బిల్డర్లు సకాలంలో అపార్టుమెంట్‌ను పూర్తి చేస్తారు తప్ప నాణ్యత గురించి అస్సలు పట్టించుకోరు. అలాంటి బిల్డర్ వద్ద ఫ్లాటు కొన్నా.. కొనకపోయినా ఒక్కటేనని గుర్తుంచుకోండి.