Categories: TOP STORIES

బిల్డ‌ర్ల‌కు చెరువులు రాసివ్వ‌ట్లేదు

  • బిల్డర్ల సాయంతో అభివృద్ధి చేస్తున్నాం
  • చెరువుల అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ
  • కార్య‌క్ర‌మంలో వంద‌కు మందికి పైగా పాల్గొన్న బిల్డ‌ర్లు

 

(రెజ్ న్యూస్‌, హైద‌రాబాద్‌)

హైదరాబాద్ పరిధిలోని చెరువులను బిల్డర్ల సాయంతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరవాసులు సాయంత్రం పూట కాస్త సేద తీరేందుకు అనువుగా వాటిని తీర్చిదిద్దుతున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఖాజాగూడులో చెరువుల అభివృద్ధి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయ‌న ఏమ‌న్నారంటే.. ‘హైదరాబాద్ లో పుట్టి పెరిగినవారికి, ఇక్కడకు వచ్చి స్థిరపడినవారికి ఈ నగరంతో అవాజ్యమైన అనుబంధం ఉంటుంది. 440 సంవత్సరాలకు పైబడిన చరిత్ర కలిగిన నగరం. 1908లో హైదరాబాద్ లో మూసీ నదికి వరదలు వచ్చాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు నిరోధించేందుకు తగిన చర్యలు చేపట్టాలని మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అప్పటి నిజాం బాధ్యతలు అప్పగించారు.

హైదరాబాద్ వాటర్ బాడీస్ ను సమన్వయం చేసేలా తగిన ఇంజనీరింగ్ ప్రణాళిక ఇవ్వాలని సూచించారు. ఆ నేపథ్యంలోనే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మాణాలు జరిగాయి. హైదరాబాద్ టోపోగ్రఫీ ప్రకారం 94 శాతం నీళ్లు గ్రావిటీ ద్వారా మూసీలోకి వెళ్లిపోతాయి. హైదరాబాద్ కు మూసీ ఓ వరం. హైదరాబాద్ లో కురిసిన ప్రతి వర్షపు చుక్కా మూసీలోకే వెళుతుంది. హైదరాబాద్ అంటే ఎంసీహెచ్ లేదా జీహెచ్ఎంసీ మాత్రమే కాదని.. ఓఆర్ఆర్ బయట ఉన్న పది కిలోమీటర్ల భూభాగాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం చెప్పారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కూడా వస్తున్నందున అంత మేర హైదరాబాద్ ను చూడాలి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రజలు సేద తీరడం కోసం ఏం చేయాలా అని ఆలోచించి.. చెరువుల అభివృద్ధి కార్యక్రమం చేపట్టాం. దుర్గం చెరువు బ్రిడ్జి నిర్మించి, చెరువును అభివృద్ధి చేసిన తర్వాత అది పర్యాటకపరంగా ఎంత పాపులర్ అయిందో మీకు తెలుసు. ఆ బ్రిడ్జి లేని సినిమా లేదు. మొన్న ఫాక్స్ కాన్ చైర్మన్ హైదరాబాద్ వచ్చారు. ఆయన కొంగరకలాన్ నుంచి ప్రగతి భవన్ కు వచ్చిన తర్వాత ఇది భారతదేశమేనా అనే సందేహం వచ్చిందన్నారు. హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందో అని చెప్పడానికి ఇది నిదర్శనం.

హైదరాబాద్ లోని 50 చెరువులను అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కొన్ని కొన్ని చెరువుల్లో ప్రైవేటు ల్యాండ్స్ ఉన్నాయని చెబుతున్నారు. వీటిని శిఖం పట్టాలంటారు. చెరువు నిండుగా ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి వీలుండదు. అయితే, చెరువులో నీరు తక్కువ ఉన్నప్పుడు అక్కడ ఉన్న భూమిలో సాగు చేయడం కోసం ఇచ్చిన పట్టాలనే శిఖం పట్టాలంటారు. దుర్గం చెరువు సహా చాలా చెరువుల్లో ప్రైవేటు భూములున్నాయి. అయితే, వాటిలో నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి టీడీఆర్ జారీ చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం 200 శాతం టీడీఆర్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఆ ప్రైవేటు భూములను సేకరిస్తున్నాం. అలాగే చెరువులకు సంబంధించి డీమార్కింగ్ కూడా చేశాం. బిల్డర్లు పని ప్రారంభించడానికి ముందే అన్ని అంశాలూ స్పష్టంగా ఉండేలా అధికారులు చూసుకోవాలి. ఇంకో విషయం.. ఇలా చెరువులను బిల్డర్ల సహాయంతో అభివృద్ధి చేయాలనే ఆలోచన వచ్చిందని చెబితే.. మర్నాడు చెరువులను రియల్ ఎస్టేట్ కి రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేశారు. చెరువులు రియల్ ఎస్టేట్ వాళ్లకు రాసివ్వడంలేదు. చెరువుల సుందరీకరణంలో బిల్డర్లను భాగస్వాములను మాత్రమే చేస్తున్నాం. వారితో సామాజిక బాధ్యతగా డబ్బు ఖర్చు పెట్టిస్తున్నాం. చెరువులు పూడ్చేసి భవనాలు కట్టడాలు ఉండవు. దీనిపై దుష్ప్రచారం వద్దు. బిల్డర్లు కూడా చెరువుల సుందరీకరణ విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించండి’ అని పేర్కొన్నారు.

 

ఉత్సాహంతో ప‌ని చేయాలంటే..

చెరువుల దత్తత అనేది చాలా మంచి కార్యక్రమం. ప్రభుత్వం ఈ పథకం ప్రకటించిన తర్వాత క్రెడాయ్ నుంచి చాలామంది వచ్చారు. ఇప్పుడు దత్తత తీసుకున్న 50 చెరువుల్లో ఎక్కువ మంది క్రెడాయ్ బిల్డర్లే. చెరువుల అభివృద్ధికి సంబంధించిన డిజైన్ లో కూడా మాకు ప్రాతినిథ్యం కల్పించాలి. దీనివల్ల వారంతా కాస్త ఉత్సాహంతో పనిచేస్తారు. – రామకృష్ణారావు, అధ్య‌క్షుడు, క్రెడాయ్ హైద‌రాబాద్

మురుగునీటి పారుద‌ల‌పై దృష్టి..

చెరువుల అభివృద్ధి కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు. ప్రజలు తమ కుటుంబాలతో సేదతీరేలా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అందరి చూపూ హైదరాబాద్ వైపే ఉంది. తమ పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన నగరమని భావిస్తున్నారు. హైదరాబాద్ అన్ని విధాలా అభివృద్ధి చెందింది. గత ఎనిమిదేళ్లలో హైదరాబాద్ ను అభివృద్ధి చేయడమే కాకుండా సురక్షితమైన నగరంగా చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మురుగునీటి పారుదల విషయంపై కాస్త దృష్టి పెట్టాలని కోరుతున్నాం. – సునీల్ రెడ్డి, అధ్య‌క్షుడు, న‌రెడ్కో తెలంగాణ

This website uses cookies.