హైదరాబాద్‌లో ఫ్రీ మనీకి అలవాటు పడ్డ కొంతమంది రియల్టర్లు ఎంతకు బరితెగించారంటే.. ఏకంగా హెచ్ఎండీఏ వేలం వేసే ప్లాట్లనూ ప్రీలాంచ్‌లో అమ్మేందుకు స్కెచ్ వేశారు. తాజగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనను చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే.
ఆక్సీ బ్రిక్స్ వరల్డ్ అనే సంస్థ ఫౌండర్ అయిన రాధాకృష్ణ తాటవర్తి.. ఏకంగా హెచ్ఎండీఏ వేలం పాటలకే టార్గెట్ పెట్టారు. బాచుపల్లిలో కొన్ని ప్లాట్లను వేలం వేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎంతో కష్టపడి ప్రీబిడ్ సమావేశాన్ని అధికారులు విజయవంతం చేశారు. అయితే, ఆక్సీ బ్రిక్స్ వరల్డ్ సీఈవో రాధాకృష్ణ ఏం చేశాడంటే.. ఈ వేలంలోని ప్లాట్లను బూచిగా చూపెట్టి.. పత్రికల్లో ప్రకటనల్ని విడుదల చేసి పెట్టుబడిదారుల్ని ఆహ్వానించారు. ప్లాట్లను వేలంలో దక్కించుకుంటే.. 18 నెలల్లో రెండు రెట్లు పెరుగుతుందనే ఆశను కల్పించారు. ఇంకేముంది వెనకా ముందు ఆలోచించకుండా.. ఇతను ఇచ్చే ప్రజంటేషన్ చూసి.. కొందరు పెట్టుబడి పెట్టేందుక సిద్ధమయ్యారు. ఇతను ఎంత తెలివిగా మోసం చేసే ప్రయత్నం చేశాడంటే.. ఒక్కో పెట్టుబడిదారుడి నుంచి కనీసం లక్ష రూపాయల్ని వసూలు చేసేందుకు ప్లాన్ చేశాడు.
200 గజాల ప్లాటును రూ. 50 లక్షలు పెట్టి కొనాలంటే ఎవరూ ముందుకు రాకపోవచ్చు.. కానీ లక్ష రూపాయలు పెట్టమంటే ఎవరైనా సులువుగా బోల్తా పడతారని ఈ సారువారు బడా స్కెచ్ వేశారు. ఒక్కొక్క వ్యక్తి నుంచి కనీసం లక్ష వసూలు చేయాలని ప్లాన్ చేశారు. గరిష్ఠంగా రూ.కోటి వసూలు చేయాలని డిసైడ్ అయ్యాడు. కనీసం లక్ష పెడితే పద్దెనిమిది నెలల్లో రెండు రెట్లు పెరుగుతుందని నమ్మబలికాడు. అంటే, ఒకే ప్లాటును వీలైనంత ఎక్కువ మందికి అంటగట్టేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించి ఇటీవల మాదాపూర్ ఆవాసా హోటల్ ఎదురుగా గల టీ హైవ్‌లో ఏకంగా ప్రీ బిడ్ సమావేశాన్ని సైతం నిర్వహించారు. అందులో పాల్గొన్నవారికి లంచ్ ఏర్పాటు చేయడంతో పాటు మొదటి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టేవారికి ఒక గజం ఉచితంగా కూడా ప్రకటించేశాడు. అతని సొంత స్థలాన్ని ఉచితంగా ఇస్తున్నట్లు.. ఏకంగా హెచ్ఎండీఏ ప్లాట్లను బహుమతిగా ఇచ్చేయాలని డిసైడ్ అయ్యాడీ సారువారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న హెచ్ఎండీఏ అధికారులు కాస్త ఆలస్యంగా కళ్లు తెరిచారు. తూచ్.. ఇదో పెద్ద మోసం అంటూ ఏకంగా బాచుపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలోనూ కోకాపేట్ నియోపోలిస్ ఒక సంస్థ ఇదేవిధంగా పత్రికలో ప్రకటన ఇవ్వగానే హెచ్ఎండీఏ పత్రికల్లో హడావిడి చేసింది. కేసు పెట్టింది. కానీ, ఆ తర్వాత ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. మరి, ఈ కేసును ఏం చేస్తారో? వేలానికి ఒకట్రెండు రోజుల ముందే వెలువడే ఇలాంటి వార్తల వల్ల హెచ్ఎండీఏ వేలానికీ మంచి ఆదరణ పెరిగే అవకాశముంటుంది. సూట్ బూట్ వేసుకుని పెట్టుబడిదారుల్ని ఆకర్షించిన ఈ వ్యక్తి మాయలో ఎంతమంది పడ్డారు? ఎంతమంది ఇంతవరకూ పెట్టుబడి పెట్టారు? గతంలో ఎవరి నుంచి అయినా పెట్టుబడుల్ని స్వీకరించాడా? అయితే, ఎంతమొత్తం వసూలు చేశాడు? ఇలాగే సామాన్య ప్రజానీకం కష్టార్జితంతో ఆటాడుకునే మోసగాళ్లు ఇంకా ఎంతమంది ఉన్నారు? పోలీసులు కాస్త లోతుగా పరిశోధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This website uses cookies.