Categories: TOP STORIES

మనకూ కావాలి ఈవీ మార్గదర్శకాలు

  • ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌పై ఢిల్లీలో గైడ్‌ బుక్‌ ఆవిష్కరణ
  • ప్ర‌భుత్వాన్ని కోరుతున్న రియ‌ల్ ఎస్టేట్ గురు

పెట్రో ధరల పెంపు నేపథ్యంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల హవా పెరుగుతోంది. పర్యావరణ అనుకూలం కావడం, ఖర్చు తక్కువ కావడంతో జనం ఈ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) చార్జింగ్‌ స్టేషన్ల అవసరం కూడా పెరుగుతోంది. కొత్తగా వచ్చే ప్రాజెక్టుల్లో వీటిని ఏర్పాటు చేస్తుండగా.. ఇప్పటికే ఉన్న పెద్ద పెద్ద కమ్యూనిటీల్లోనూ వీటిని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ఆయా రెసిడెన్స్‌ వెల్ఫేర్‌ సొసైటీలకు పూర్తిగా అవగాహన కల్పించేందుకు ఢిల్లీలోని డైలాగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కమిషన్‌ (డీడీసీ) నడుం బిగించింది. వరల్డ్‌ రీసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి ‘రెసిడెన్షియల్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ గైడ్‌ బుక్‌’ ఆవిష్కరించింది. అన్నిరకాల నివాస గృహాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ కేంద్రాలను ఎలా ఏర్పాటు చేసుకోవాలనే విషయాలను ఇందులో క్షుణ్నంగా పొందుపరిచారు.

ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల ప్రాముఖ్యత ఏమిటి? రెసిడెన్షియల్‌ సొసైటీల్లోని పార్కింగ్‌ ప్రదేశాల్లో వాటిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి? వాటిని ఎలా నిర్వహించాలి వంటి అంశాలను సమగ్రంగా వివరించారు. అంతేకాకుండా దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది? అవసరమైనంత మేర స్థలం లేకపోతే ఏం చేయాలి? పవర్‌ లోడ్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాలపై వచ్చే సందేహాలను కూడా నివృత్తి చేశారు.

ఢిల్లీలోని అన్ని రకాల నివాస సమూహాల్లో వీటిని ఏర్పాటును ప్రోత్సహించేందుకే ఢిల్లీ సర్కారు ఈ గైడ్‌ బుక్‌ ఆవిష్కరించిందని డీడీసి వెల్లడించింది. ఈవీ ఉద్యమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయడం కోసం మార్గదర్శకాలు రూపొందించిన రాష్ట్రాల్లో ఢిల్లీయే మొదటిదని పేర్కొంది. పైగా మొదటి 30వేల చార్జింగ్‌ పాయింట్లకు రూ.6వేల వరకు వందశాతం గ్రాంటు కూడా ఇస్తామని ప్రకటించింది.అలాగే ఆయా కేంద్రాలకు ప్రత్యేకమైన విద్యుత్‌ టారిఫ్‌ పెడతామని పేర్కొంది. కాగా, ఇలాంటి మార్గదర్శకాలు మన రాష్ట్రంలో కూడా విడుదల చేస్తే బాగుంటుందని రియ‌ల్ ఎస్టేట్ గురు ప్ర‌భుత్వాన్ని కోరుతుంది.

This website uses cookies.