- సెల్లార్ల సమస్యలు ఎక్కువగా చిన్న బిల్డర్లకే
- నగర పరిధిలో కట్టే అపార్టుమెంట్లలోనే అధికం
- 900 గజాలు దాటితే సెల్లార్లు తవ్వాలంటే నరకం
- బండరాళ్లు వస్తే బ్లాస్టింగ్ చేయలేని దుస్థితి
- అనుమతితో చేస్తే కొట్లాటలు.. పోలీసు కేసులు
- చిన్న బిల్డర్లకూ పోడియం లాభం కలగాలి
అపార్టుమెంట్లను కట్టాలంటే ముందుగా పునాదులు తవ్వాలి.. మట్టి తీయాలి.. లారీల్లో పోసుకుని ఎక్కడో దూరంగా తీసుకెళ్లాలి. సెల్లార్లు తవ్వేటప్పుడు బండరాళ్లు వస్తే.. బిల్డర్లకు తలనొప్పి. దాన్ని పక్కన నివసించేవారికైతే ఎక్కడ్లేని ఇబ్బంది. మరి, నగర పరిధిలో తక్కువ విస్తీర్ణంలో కట్టే అపార్టుమెంట్లకు పోడియం పార్కింగ్ సదుపాయాన్ని కల్పించకుండా.. పురపాలక శాఖ బడా నిర్మాణాలకే ఎందుకు వర్తింపజేస్తోంది? ఈ విధానాన్ని చిన్నసైజు అపార్టుమెంట్లకూ వర్తింపజేయాలని.. ఇందుకు సంబంధించి మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని.. నిబంధనల్ని సవరించాలని చిన్న, మధ్యస్థాయి నిర్మాణ సంస్థలు కోరుతున్నాయి.
హైదరాబాద్‌లో రింగ్ రోడ్డు లోపు ఉన్న ప్రాంతాల్లో.. ఎకరం కంటే తక్కువ విస్తీర్ణంలోనే చిన్న బిల్డర్లు ఎక్కువగా అపార్టుమెంట్లను నిర్మిస్తుంటారు. ప్రధానంగా 900 గజాలు లేదా అంతకంటే ఎక్కువ స్థలంలో కడుతుంటారు. వీరు పని ఆరంభించాలంటే.. తప్పనిసరిగా సెల్లార్లు తవ్వాల్సిందే. ఈ క్రమంలో ప్రొక్లెయిన్లతో మట్టిని తవ్వుతుంటే చుట్టుపక్కల వారు అభ్యంతరం చెబుతున్నారు. పోలీసు కేసులూ పెడుతున్నారు. కూకట్ పల్లి నుంచి మియాపూర్, చందానగర్ దాకా సెల్లార్ల కోసం నాలుగు ఫీట్లు తవ్వితే చాలు.. బండరాళ్లు వస్తున్నాయి.
దీంతో, ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో బిల్డర్లకు కళ్ల ముందు కనిపిస్తుంది. బ్లాస్టింగ్ కోసం అనుమతి లభించినా అక్కడి చుట్టుపక్కల పరిస్థితులు ముందుకు వెళ్లనీయడం లేదు. పోనీ ట్రాక్టర్లు పెట్టి పని చేయిద్దామంటే భయంకరమైన శబ్దాలొస్తాయి. ఇలాంటి సమస్యలన్నీ ఎక్కువగా నగర పరిధిలో కట్టే చిన్న, మధ్యస్థాయి డెవలపర్లే ఎదుర్కొంటున్నారు. పైగా, సెల్లార్లు తవ్వడం వల్ల కొందరు కంట్రాక్టర్లు గుట్టుచప్పుడు కాకుండా.. చుట్టుపక్కల చెరువులు, నాలాలు, రోడ్ల మీదే డంప్ చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
పెద్ద డెవలపర్లకు ఇబ్బందుల్లేవు..
చిన్న బిల్డర్లు ఎదుర్కొనే సమస్యలు పెద్ద బిల్డర్లకు ఉండవు. వారి సమస్యలన్నీ వేరే. శివారు ప్రాంతాల్లోనే అది కూడా ఖాళీ ప్రదేశాల్లోనే ఎక్కువగా కడతారు. సెట్ బ్యాకు ఎక్కువే ఉంటుంది కాబట్టి, మట్టిని తరలించేందుకు ఇబ్బందులుండవు. ఖాళీ ప్రాంతాల్లో మట్టిని అన్ లోడ్ చేస్తారు. ప్రజలతో ప్రత్యక్షంగా వారికి ఎలాంటి సమస్యలుండవు.
చిన్న బిల్డర్లకూ వర్తింపజేయాలి..
900 చదరపు మీటర్ల నుంచి ఎకరంలోపు కట్టే అపార్టుమెంట్టే ఎక్కువగా నగరంలో కడతారు. కాబట్టి, వీరికి పోడియం పార్కింగ్ సదుపాయం కల్పించాలి. ఏదో ఒక వైపున్న డ్రైవ్ వే నుంచి ఒక ర్యాంప్ ఇస్తే సరిపోతుంది. 21 మీటర్ల దాకా ఫైర్ ఎన్వోసీ లేకుండా రెండు స్టిల్టులు, ఐదు అంతస్తుల్ని కట్టేందుకు అనుమతినివ్వమని కోరుతున్నాం. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇందుకు అంగీకరిస్తున్నాయి. మన వద్ద కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలి. ఫైర్ ఇంజిన్లు వంద మీటర్ల ఎత్తు వరకూ వెళ్లే పైపులొచ్చాయి. ఒకవేళ మరీ అవసరమైతే ఐదు అంతస్తుల్లోపు ఫైర్ సిస్టమ్ పెట్టమన్నా చిన్న సంస్థలు పెట్టేందుకు ప్రయత్నిస్తాయి. – లయన్ ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి, నరెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్.